టీడీపీ, వైసీపీ.. ఈ కీలక నేతలకు టికెట్లేవీ?
మరోవైపు టీడీపీ కూడా తాను పోటీ చేసే 144 అసెంబ్లీ స్థానాలకు గానూ 128 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి. అధికార వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే వైసీపీ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు టీడీపీ కూడా తాను పోటీ చేసే 144 అసెంబ్లీ స్థానాలకు గానూ 128 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. జనసేన పార్టీ సైతం 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఒకటి, రెండు రోజుల్లో మిగతా అభ్యర్థులను కూడా ప్రకటించనుంది.
అయితే అటు వైసీపీ, ఇటు టీడీపీ కీలక నేతలకు టికెట్లు ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ ఇద్దరు కీలక నేతలు రాష్ట్రవ్యాప్తంగా గత ఎన్నికల్లో ఆయా పార్టీల తరఫున పోటీ చేశారు. వీరిలో టీడీపీ తరఫున దివంగత నేత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ, వైసీపీ తరఫున ప్రముఖ సినీ నటుడు ఆలీ ఉన్నారు. వీరిద్దరూ 2019 ఎన్నికలలో తమ పార్టీల తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు.
వైసీపీ తరఫున ప్రముఖ సినీ నటుడు ఆలీకి టికెట్ ఖాయమని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆయన పేరు గుంటూరు తూర్పు, రాజమండ్రి అసెంబ్లీ స్థానాలతోపాటు కర్నూలు, నంద్యాల పార్లమెంటు స్థానాలకు గట్టిగా వినిపించింది. అయితే ఎక్కడా ఆలీకి సీటు ఇవ్వలేదు. 2019 ఎన్నికల ముందు ఆలీ వైసీపీలో చేరారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎంపీ పదవికి పలుమార్లు ఆలీ పేరు వినిపించింది. అయితే ఏదీ దక్కలేదు.
చివరకు ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా ఒక పదవిని ఆలీకి ఇచ్చారు. ఆలీ కూడా ఆ పదవితో సర్దుకుపోయారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు ఖాయమని ఆయన భావించగా వైసీపీ అధినేత జగన్ ఆయనకు హ్యాండ్ ఇచ్చారు.
ఇక టీడీపీ తరఫున వంగవీటి రాధా పరిస్థితి కూడా ఇదే. గత ఎన్నికల ముందు కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో రాధా టీడీపీ తరఫున ప్రచారం చేశారు. ఆయనకు కూడా ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో రాధా ఏ పదవి లేకుండా మిగిలిపోయారు.
ఈ ఎన్నికల్లో అయినా ఆయనకు సీటు ఇస్తారని ఊహించగా విచిత్రంగా వంగవీటి రాధాకు చంద్రబాబు మొండిచేయి చూపారు. రాధా గతంలో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీ, వైసీపీ తరఫున విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్ స్థానాల నుంచి పోటీ చేశారు.
అయితే విజయవాడ తూర్పు, విజయవాడ సెంట్రల్ స్థానాలకు ఇప్పటికే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. విజయవాడ తూర్పుకు సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు, విజయవాడ సెంట్రల్ కు మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావును అభ్యర్థులుగా ప్రకటించారు. దీంతో వంగవీటి రాధాకు సీటు లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో వంగవీటి రాధా జనసేన పార్టీ ముఖ్య నేతలు.. నాదెండ్ల మనోహర్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరితో తాజాగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో వంగవీటి రాధా అవనిగడ్డ నుంచి జనసేన పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీ చేస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. వైసీపీ తరఫున ఆలీకి అయితే ఇక ఏ అవకాశం లేనట్టే. మరి జనసేన నుంచైనా వంగవీటి రాధాకు సీటు దక్కుతుందో, లేదో వేచిచూడాల్సిందే.