సంక్రాంతి సెలవులకు ఎన్నారైలు... పండగతోపాటు వైద్య పరీక్షలు!
ఇలాంటి వాటిలో వైద్య చికిత్సలు ముందు వరుసలో ఉంటున్నాయని అంటున్నారు. ఈ సంఖ్య హైదరబాద్, ముంబై వంటి ప్రాంతాల్లో బాగా పెరిగిందని చెబుతున్నారు.
సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలుగు లోగిళ్లలో జరిగే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా.. ఆ సమయానికి సొంత ఊరిలో వాలిపోవాలని చాలా మందికి ఉంటుంది. ఏమాత్రం అవకాశం ఉన్నా.. సంక్రాంతికి ఊరుకి వెళ్లడం ఫస్ట్ ప్రిఫరెన్స్. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పట్టణాల్లో ఉన్నావారే కాదు సుమా.. ఇతర దేశాల్లో ఉన్నవారికి సైతం ఇది అత్యంత ప్రాముఖ్యమైన విషయం!
అవును... యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ లో ఉన్న ఎంతోమంది తెలుగువారు ఏటా సంక్రాంతికి తమ సొంతూళ్లకు కుటుంబాలతో సహా వస్తుంటారు. ఈ క్రమంలో పండగతో పాటు పనిలో పనిగా సొంత పనులు చక్కదిద్దుకుంటుంటారు. ఇలాంటి వాటిలో వైద్య చికిత్సలు ముందు వరుసలో ఉంటున్నాయని అంటున్నారు. ఈ సంఖ్య హైదరబాద్, ముంబై వంటి ప్రాంతాల్లో బాగా పెరిగిందని చెబుతున్నారు.
ప్రధానంగా... హైదరాబాద్, ముంబయిలకు ఇటీవల ఎన్నారైలే కాకుండా ఇతర దేశాల రోగుల తాకిడీ కూడా క్రిస్మస్ సెలవుల్లో పెరిగింది. ఈ క్రమంలో... ఎక్కువమంది కీళ్ల, దంత, ఊబకాయ సమస్యలతోపాటు మొదలైన వ్యాదులకు ఇండియాలో చికిత్స తీసుకుంటున్నారు. కొందరైతే గుండె శస్త్ర చికిత్సల కోసం సైతం భారత్ కు వస్తున్నారని అమెరికాలోని తెలుగు వైద్యులు చెబుతున్నారు!
వాస్తవానికి గతంలో నాణ్యమైన వైద్యం కోసం కాస్త డబ్బున్నవారు విదేశాలకు క్యూ కట్టేవారు. అయితే ఆ పరిస్థితిలో ఇప్పుడు మార్పు వచ్చిందని చెబుతున్నారు నిపుణులు. ఇందులో భాగంగా.. యూరప్ నుంచే కాకుండా అరబ్బు దేశాల నుంచి ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు విదేశీయుల తాకిడి పెరిగిందని అంటున్నారు. పలు కార్పొరేట్ ఆసుపత్రులు వీరి కోసం ప్రత్యేకంగా వార్డులు తెరుస్తున్నాయి.
ప్రధానంగా విదేశాలతో పోలిస్తే... కొన్ని చికిత్సలకు పదోవంతు ధరకే నాణ్యమైన సేవలు భారత్ లో అందుతుండటం ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు పండగలకు భారత్ కు వచ్చే ఎన్నారైలకు వైద్య చికిత్సలు సైతం ఇప్పుడు పండగల సమయంలో మరో కార్యక్రమంగా మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!