ఎన్టీఆర్ 100 ఫీట్ల విగ్రహం.. ఎక్కడంటే..?

ఈ క్రమంలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

Update: 2024-11-06 10:30 GMT

అటు సినిమా రంగంలో సత్తా చాటుతూనే.. ఇటు రాజకీయ రంగ ప్రవేశం చేశారు నందమూరి తారకరామారావు. కొత్తగా తెలుగుదేశం పేరిట పార్టీని స్థాపించి రికార్డును సృష్టించారు. అంచెలంచెలుగా పార్టీని అభివృద్ధి చేస్తూ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆ సమయంలో అదో ప్రభంజనం. ఇటు సినీ వినీలాకాశంలో సక్సెస్ ఫుల్ హీరోగా పేరు పొందిన ఆయన.. అటు రాజకీయాల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించారు. తరువాతి పరిణామాల నేపథ్యంలో ఆయన కాలం చెల్లినప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇంకా ప్రజల్లో నిండి ఉన్నాయి. ఇప్పటికీ ఆయన అభిమానులు ఆయనను తలచుకోని రోజూ ఉండదు.

అయితే.. రాష్ట్ర విభజన తరువాత చంద్రబాబు నాయుడు రెండో సారి ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ ఎమ్మెల్సీ, పార్టీ నేత జనార్దన్ వెల్లడించారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు ఏడాది పాటు ఘనంగా నిర్వహించినట్లు జనార్దన్ చెప్పారు. మరికొన్ని రోజుల్లోనే ఎన్టీఆర్‌కు గుర్తుగా హైదరాబాద్ నగరంలో 100 ఫీట్ల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లుగా చెప్పారు. ప్రస్తుతం విగ్రహం ఏర్పాటు కోసం స్థల సేకరణ కోసం చూస్తున్నామని వెల్లడించారు. విగ్రహంతోపాటే కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం కూడా నిర్మిస్తున్నట్లు చెప్పారు.

తెలుగువారంతా ఏకం కావాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని జనార్దన్ పేర్కొన్నారు. టీడీపీకి చెందిన కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగానూ ఉన్నారని తెలిపారు. ఎన్టీఆర్ చేసిన సేవలకు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉన్నదని చెప్పారు. అయితే.. ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తెలుగు ప్రజలకు అంకితమిస్తామని స్పష్టం చేశారు.

విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు ఆ ప్రాంతాన్ని పర్యాటకంగానూ అభివృద్ధి చేస్తామని.. విగ్రహాన్ని చూసేందుకు వచ్చిన వారు అక్కడ స్టే చేసేలా నిర్మాణాలు చేపడుతామని ఎమ్మెల్సీ చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంతం ఐకాన్‌లా నిలిచిపోతుందని, హైదరాబాద్‌లోని చార్మినార్ మాదిరి ప్రఖ్యాతి గాంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న యూత్‌కు ఎన్టీఆర్ గురించి తెలియకపోవచ్చని.. అందుకే ఆయన గురించి యువతకు పూర్తిగా తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం నందమూరి ఫైళ్లను భద్రపరిచినట్లు తెలిపారు. అందుకే.. విగ్రహం వద్దే నందమూరి లైబ్రెరీని సైతం ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ప్రతీ టీడీపీ కార్యకర్త సహకారంతో 100 ఫీట్ల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. విగ్రహం ఏర్పాటు కోసం ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టీడీపీ నేతలు కలిసినట్లుగా సమాచారం.

Tags:    

Similar News