వైరల్ ఇష్యూ... 'సాక్షి'లో నారా లోకేష్!

ఈ సందర్భంగా... "లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారికి కోటి సభ్యత్వాలతో ఘన నివాళి" అని రాయగా.. ఆ ప్రకటనలో కింద భాగంలో సభ్యత్వ నమోదులో టీడీపీ సాధించిన రికార్డులను వెల్లడించారు.

Update: 2025-01-18 06:30 GMT

నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్థంతి సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా టీవీల్లోనూ, పత్రికల్లోనూ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రకటనలు ఇస్తున్నారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది.. 'సాక్షి'లోని ఫుల్ పేజ్ ప్రకటనలో లోకేష్ కనిపించారు!

అవును... ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు మీడియా రాజకీయ పార్టీల వారీగా విడిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఉన్న ప్రధాన పత్రికలు ఎప్పుడో ఆ దిశగా తమ వైఖరిని మార్చేసుకున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... మిగిలిన పత్రికలు ఒక వైపు ఉంటే.. సాక్షి పత్రిక వైసీపీ పక్షాన్న ఉంటుందనే చర్చ జనాల్లో ఉంది! ఈ సమయంలో సాక్షి పత్రికలో ఫుల్ పేజీ ప్రకటన పసుపుమయం అవ్వడం ఆసక్తిగా మారింది.

 

ఈ సందర్భంగా సాక్షి పత్రికలోని మొదటి ఫుల్ పేజీ ప్రకటన ఇచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతి రెడ్డి. ఈ ప్రకటనలో పైన చిన్నగా నందమూరి బాలకృష్ణ, పల్లా శ్రీనివాసరావు ఫోటోలు ఉండగా.. మధ్యలో పెద్దగా స్వర్గీయ ఎన్టీఆర్, నారా లోకేష్, చంద్రబాబు ఫోటోలు ఉన్నాయి. ఈ సందర్భంగా... కోటి సభ్యత్వాలతో ఘననివాళి అర్పిస్తున్నట్లుగా ఈ ప్రకటన ఇచ్చారు.

ఈ సందర్భంగా... "లోకేష్ నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారికి కోటి సభ్యత్వాలతో ఘన నివాళి" అని రాయగా.. ఆ ప్రకటనలో కింద భాగంలో సభ్యత్వ నమోదులో టీడీపీ సాధించిన రికార్డులను వెల్లడించారు. ఇందులో భాగంగా... 11 నియోజకవర్గాల్లో లక్ష దాటి, 105 నియోజకవర్గాల్లో 50 వేలు దాటి సభ్యత్వాలు నమోదైనట్లు తెలిపారు.

ఏది ఏమైనా... ఈ రోజు ఉదయం (18-01-2025) సాక్షి దినపత్రిక చూసినవాళ్లకు ఫస్ట్ పేజీలో పుల్ పేజీ ప్రకటన లోకేష్ పేరున ఎన్టీఆర్ కి నివాళులు అర్పిస్తున్నట్లు ఉండటం మాత్రం వైరల్ గా మారింది.

Tags:    

Similar News