కేంద్రం మిథ్య అన్నారు ఎన్టీఆర్.... ఆ స్ఫూర్తి ఏదీ ?
కేంద్రం మిథ్య అని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన 1983 జనవరిలో ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు.;

కేంద్రం మిథ్య అని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అన్నారు. ఆయన 1983 జనవరిలో ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో ఆయన ఆలోచనలు శరవేగంగా పరుగులు తీసేవి. అయితే చాలా విషయాలలో కేంద్రం నుంచి అనేక అవాంతరాలు అడ్డు పుల్లలు వచ్చి పడుతూ ఉండేవి.
ఆనాడు కేంద్రంలో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండేవారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు. తమను సవాల్ చేసి ఓడించి అధికారంలోకి వచ్చిన టీడీపీ లాంటి పార్టీల పట్ల నాటి కాంగ్రెస్ పెద్దలకు ఆగ్రహం ఉండేది. దానిని వారు ఆచరణలో చూపేవారు. ఏపీ విషయంలో వివక్ష కూడా ఉండేదన్న మాటలు కూడా నాడు ప్రచారంలో ఉన్నాయి.
దీంతో ఎన్టీఆర్ విసిగిపోయారు. రాష్ట్రాలు ఉంటేనే కదా కేంద్రం అన్నారు ఆయన. అంతే కాదు రాష్ట్రాలే నిజమని ఆయన చెప్పారు. కేంద్రాన్ని మిధ్య అన్నారు. అంటే కేంద్రం అన్న దానికి ఉనికే లేదని ఆయన అభిప్రాయం అన్న మాట. రాష్ట్రాల సమాహారంగా సమాఖ్యగా కేంద్రం ఉండాలి తప్ప పెద్దన్నగా వ్యవహరించడం తగదని ఆయన స్పష్టం చేశారు.
అలా కేంద్రం రాష్ట్రాల అధికారాలను కత్తెర వేయడం పట్ల ఆగ్రహించిన ఎన్టీఆర్ భావసారూప్యం కలిగిన పార్టీలతో సీఎంలతో సమావేశాలు నిర్వహించి మరీ కేంద్రాన్ని దారిలోకి తెచ్చే పనిలో పడ్డారు. ఒక విధంగా ఎన్టీఆర్ తొలిసారిగా దక్షిణాదిన సాగుతున్న వివక్ష మీద హక్కుల మీద పోరాడిన మొనగాడిగా చరిత్రలో ఉన్నారు.
అదే ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలో ఈ రోజు ఈ విధమైన స్పూర్తి ఉందా అన్నది చర్చ. కేంద్రం ఏది చెబితే దానికి సరే అన్న తీరుగా ప్రస్తుతం తెలుగుదేశం వ్యవహారం ఉందని విమర్శలు వస్తున్నాయి. ఈ రోజున డీలిమిటేషన్ వ్యవహారం అయితే చాలా తీవ్రంగా ఉంది. నిజానికి ఇది సీరియస్ వ్యవహారం కూడా.
భావితరాలు సైతం ఈ రోజున రాజకీయ పార్టీలు కానీ పాలకులు కానీ తీసుకున్న నిర్ణయం మీదనే ఆధారపడి ఉన్నాయి. ఎంపీ సీట్లు తగ్గినా నిధులలో వాటా తగ్గినా దక్షిణాదికి రాజకీయ పలుకుబడి తగ్గినా రేపటి జనరేషన్ ఎలా ముందుకు సాగుతారు అన్నది కీలకమైన ప్రశ్నలు. అందువల్ల కేంద్రంలోని పార్టీలను నిలదీయాల్సిన సందర్భం ఇదని అంటున్నారు.
దీని మీద విశాఖలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ నటుడు నిర్మాత దర్శకుడు రాజకీయాల మీద ఎప్పటికపుడు స్పందించే ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ఎన్టీఆర్ కేంద్రం మిథ్య అన్నారు అని గుర్తు చేశారు. కేంద్రం తీరు చూస్తే దక్షిణాదికి వివక్ష కొనసాగేలా ఉందని ఆయన అన్నారు. దక్షిణాదికి ఎంపీ సీట్లలో అన్యాయం జరుగుతోందని అన్నారు. ఉత్తరాది వాళ్ళే మొత్తం ఎంపీ సీట్లను పట్టుకుని పోతున్నారని అన్నారు.
ఆనాడు కేంద్రం మిథ్య అని ఎన్ టీఆర్ అన్న మాటలే వాస్తవం అని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నం అయింది అన్నారు. ఆ దిశగా అందరూ కృషి చేయాలని నారాయణమూర్తి కోరారు.
దీనిని బట్టి చూస్తే అన్న గారి స్ఫూర్తి ని అంతా అంది పుచ్చుకోవాలని ఆయన కోరుతున్నారు. మరి ఎన్టీఆర్ స్పూర్తిని ఏపీలోని పార్టీలు తీసుకుంటున్నాయా అన్నదే చర్చ. అవసరం అయినపుడైనా కేంద్రాన్ని నిలదీసి రాష్ట్రాల హక్కులను కాపాడుకుంటూ అన్యాయాల మీద గళం విప్పే నాయకత్వం కావాలని జనాలు కోరుతున్నారు. దక్షిణాది అన్యాయం అని అంటున్నారు. దాని కంటే ముందు ఏపీ అన్యాయం అయింది అని కూడా గుర్తు చేస్తున్నారు.
ప్రత్యేక హోదా లేదు, రెవిన్యూ లోటు పూడ్చలేదు, 9, 10 షెడ్యూలో ఉన్న ఆస్తుల పంపిణీ జరగలేదు, రాజధాని నిర్మించి ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ని అనుకున్న డిజైన్ ప్రకారం పూర్తి చేయలేకపోతున్నారు. ఇలా అనేక రకాలైన అన్యాయాల మీద మాట్లాడాల్సిన ఏపీ నేతలు రాజకీయ పార్టీలు కిమ్మన్నాస్తి అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. ఈ సమయంలో కనుక ఎన్టీఆర్ జీవించి ఉంటే వివక్ష మీద అన్యాయాల మీద గట్టిగా తిరగడేవారు అన్నదే అందరి మాటగా ఉంది.