న‌టి కం ఎంపి నుస్రత్ జహాన్ ఆర్థిక మోసంపై ED దర్యాప్తు?

ఈసారి నుస్ర‌త్ రియ‌ల్ ఎస్టేట్ పేరుతో క‌స్ట‌మ‌ర్ల‌ను మోసం చేశార‌నేది ఆరోప‌ణ‌

Update: 2023-08-02 03:50 GMT

న‌టి, టిఎంసి ఎంపి నుస్రత్ జహాన్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇటీవ‌ల ర‌క‌ర‌కాల‌ వివాదాల‌తో మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చిన‌ నుస్ర‌త్ ని ఇప్ప‌టికీ వివాదాలు విడిచిపెట్ట‌డం లేదు. ఇప్పుడు మ‌రోసారి సద‌రు లేడీ ఎంపి వార్త‌ల్లోకి వ‌చ్చారు. ఈసారి నుస్ర‌త్ రియ‌ల్ ఎస్టేట్ పేరుతో క‌స్ట‌మ‌ర్ల‌ను మోసం చేశార‌నేది ఆరోప‌ణ‌.

EDకి చెందిన‌ సాల్ట్ లేక్ కార్యాలయంలో నుస్ర‌త్ జహాన్‌పై బిజెపి నాయకుడు పాండా వ్యక్తిగతంగా ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం వెలుగు చూసింది. పాండా ఫిర్యాదులో నుస్ర‌త్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసారు. తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలైన నుస్ర‌త్ గతంలో డైరెక్టర్‌గా ఉన్న ఆర్థిక సంస్థ ద్వారా మోసం జ‌రిగింద‌ని అత‌డు ఆరోపించారు.

సెవెన్ సెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నాలుగేళ్లలో సహేతుకమైన ధరలకు రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఇస్తామని ఒక్కొక్క‌రి నుండి దాదాపు రూ. 6,00,000 వ‌సూలు చేసార‌ని ఇలా దాదాపు 30కోట్ల మేర మోసానికి పాల్ప‌డ్డార‌ని ఆరోపించారు. ఆ మేర‌కు కేంద్ర ఏజెన్సీకి ఫిర్యాదు చేసారు. తమకు ఇంకా ఆ ఫ్లాట్‌లు అందజేయ‌ని సదరు సంస్థ డైరెక్టర్లు తమ సొంత ఫ్లాట్‌ల నిర్మాణానికి ఆ డబ్బును ఉపయోగించారని ఆరోపించారు.

''ఇది ఆర్థిక కుంభకోణానికి సంబంధించిన కేసు. ఈ వ్యవహారంపై గతంలో కోర్టులో కేసు దాఖలైంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్ర‌త్ ని కోర్టుకు హాజరుకావాలని కోరగా ఆమె ధిక్కరించింది. కాబట్టి మేము ఈ విషయంలో ఈడీని ఆశ్రయించవలసి వచ్చింది'' అని ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకుడు అన్నారు. ఈ విషయంలో నుస్ర‌త్ జహాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. 2019 లోక్‌సభ ఎన్నికలలో న‌టి నుస్ర‌త్ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బసిర్‌హత్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు.

Tags:    

Similar News