ఉద్యోగులకు ఫిటింగ్ లలో మస్క్ లాంటోడో ఓలా బాస్..
అప్పట్లో మస్క్ కండిషన్లు తట్టుకోలేక ట్విటర్ నుంచి పలువురు పెద్దపెద్ద ఉద్యోగులు వెళ్లిపోయారు కూడా.;
కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగం అంటే కనిపించని ‘కత్తి’.. వారు తీసుకునే నిర్ణయాలు అంత పదునుగా ఉంటాయి. ఉద్యోగులను వెంటాడే ఆయుధాలుగా కనిపిస్తాయి. ఇలాంటివాటిలో మొనగాడు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. ఉద్యోగులకు రూల్స్ తీసుకురావడంలో మస్క్ ఎలాంటివాడో దాదాపు మూడేళ్ల కిందట ట్విటర్ ను కొనుగోలు చేసినప్పుడే తెలిసింది. అప్పట్లో మస్క్ కండిషన్లు తట్టుకోలేక ట్విటర్ నుంచి పలువురు పెద్దపెద్ద ఉద్యోగులు వెళ్లిపోయారు కూడా. దీంతో ఓ దశలో ట్విటర్ ను ‘మస్క్’ చీకట్లు కమ్ముకున్నాయి.
ఇప్పుడు మస్క్ మామకు తగిన అల్లుడు అనిపించుకుంటున్నాడు ఓలా కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్. మస్క్ మాదిరిగానే తన సంస్థ ఉద్యోగులను కూడా వీక్లీ రిపోర్టులు ఇవ్వాలని కండిషన్ పెట్టాడు. దీనిని తప్పనిసరి కూడా చేయడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాక ప్రభుత్వ వ్యవస్థలో సంస్కరణలకు ‘డోజ్’ను ఏర్పాటు చేసి దానికి మస్క్ ను అధిపతిగా నియమించిన సంగతి తెలిసిందే. తన పనిలో భాగంగా మస్క్.. అమెరికా ఫెడరల్ ఉద్యోగుల పర్ఫార్మెన్స్ గురించి ఫుల్ రిపోర్టు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. ఉద్యోగులు ప్రభుత్వానికి ఏ విధంగా సాయపడ్డారో వివరించాలని లేదంటే రిజైన్ చేసి వెళ్లిపోవాలని డెడ్ లైన్ పెట్టారు. అదే బాటలో ఓలా బాస్ కూడా తమ ఉద్యోగులందరినీ వారాంతపు నివేదికలు పంపాలని కండీషన్ పెట్టాడట. గత వారమే ఉద్యోగులకు ఇ-మెయిల్ కూడా చేశాడట.
ఏం జరుగుతోంది బాస్..
ఓలా అధినేత భవీష్.. ‘క్యా చల్ రహా హై (ఏం జరుగుతోంది?)’ అనే పేరుతో తమ ఉద్యోగులకు ఈ-మెయిల్ పంపారట. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు.. అందరూ నివేదిక ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారట. ప్రతి వారం పూర్తి చేసిన పని, సాధించిన గోల్స్ ను 3 నుంచి 5 బుల్లెట్ పాయింట్లలో అప్ డేట్ కింద ఇవ్వాలని భవీష్ సూచించారట. చిన్న ఉద్యోగి నుంచి ఉన్నత స్థాయి మేనేజర్ల వరకు అందరికీ దీనిని తప్పనిసరి చేశారట. ఆదివారం సాయంత్రం వారంలో చేసిన అన్ని టాస్కులకు సంబంధించి ఫుల్ రిపోర్టు రెడీ చేసి పంపాలని ఆదేశించారట.
ఓలాలో కొన్నేళ్ల నుంచి ఉద్యోగాల కోత మాట వినిపిస్తోంది. కంపెనీ నష్టాలు తగ్గించుకునేందుకు కాంట్రాక్టు ఉద్యోగులు సహా సుమారు వెయ్యి మందికి లేఆఫ్ ఇచ్చే ప్లాన్ చేశారట. కస్టమర్ రిలేషన్స్, ప్రొక్యూర్‌మెంట్, చార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పలు విభాగాల్లో కోతలు పెడతారని తెలుస్తోంది.