కీబోర్డుపై డాలర్ గుర్తు.. ఓలా సీఈవో వాదనలో పస ఎంత?

నిత్యం చూసేదే అయినా.. పెద్దగా ఫోకస్ చేయని ఒక అంశం మీద తాజాగా ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ఒక ప్రశ్నను సంధించారు.

Update: 2024-08-26 08:30 GMT

నిత్యం చూసేదే అయినా.. పెద్దగా ఫోకస్ చేయని ఒక అంశం మీద తాజాగా ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ఒక ప్రశ్నను సంధించారు. దీంతో.. దీనిపై కొత్త చర్చ మొదలైంది. ఇంతకూ ఆయన లేవనెత్తిన అంశం ఏమంటే.. మన దేశంలో అమ్మే ల్యాప్ టాప్ లు.. కంప్యూటర్ కీ బోర్డులపై అమెరికా డాలర్ గుర్తు ఎందుకు? అన్నది సూటి ప్రశ్న. డాలర్ స్థానంలో రూపాయి గుర్తు ఎందుకు ఉండకూదన్న ప్రశ్నను ఆయన వేస్తున్నారు. ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

అదే సమయంలో బోలెడంత చర్చ జరుగుతోంది. కొందరు ఓలా సీఈవో మాటలో పస ఉందని పేర్కొంటే.. మరికొందరు ఇది అనవసర నసగా అభివర్ణిస్తున్నారు. ఇంతకూ భవేశ్ వాదన ఏమిటో చూస్తే.. డాలర్ గుర్తును హైలెట్ చేస్తూ ఉన్న కీబోర్డు ఫోటోను భవీశ్ షేర్ చేశారు. దీని కారణంగానే.. ప్రజలు ఇంకా రూపాయి గుర్తుకు బదులుగా ఐఎన్ఆర్ అని రాస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు డాలరర్ స్థానంలో ఉన్న రూపాయి గుర్తును ఎందుకు మార్చలేదన్న ఆశ్చర్యాన్ని ఆయన వ్యక్తం చేశారు.

ఈ పోస్టు పెట్టిన గంటల వ్యవధిలోనే లక్షల మంది దీన్ని చూడటం.. స్పందించటం జరిగిపోతోంది. కొందరు ఆయన వాదనను సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం అర్థం లేనిదిగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశ భక్తి.. అవసరం లేని స్వదేశాభిమానం మధ్య సన్నటి గీత ఉంటుందని.. దాన్ని దాటేస్తున్నారు.. కావాలనే చేస్తున్నారా? లేదంటే తెలీక చేస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

అమెరికన్ డాలర్ గుర్తు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో చాలా కీలకమని పేర్కొన్నారు. ఎంఎస్ ఎక్సెల్ లో దీని వినియోగం కోసమని ఇంకొకరు చెప్పగా.. దేశీయ వస్తువులను రూపాయి గుర్తుతోనే అమ్మాలన్న భవీశ్ వాదనకు సానుకూలంగా స్పందించినోళ్లు లేకపోలేతు. నిజానికి డాలర్ స్థానంలో రూపాయి గుర్తును ముద్రించటం ద్వారా కొంపలు మునిగిపోవు. ఆ మాటకు వస్తే.. డాలర్ గుర్తు అవసరం ఉంటే.. వారు ఆ గుర్తును ఆప్షన్ లో ఉంచేస్తే సరిపోతుంది. ఎవరికి పట్టకపోవటం.. అదో విషయంగా భావించకపోవటంతో కంపెనీలు సైతం ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోని పరిస్థితి. భవీశ్ లాంటి ప్రభావవంతమైన వారి వాదనల పుణ్యమా అని.. ఇప్పుడే కాకుండా రానున్న రోజుల్లో కీబోర్డుల్లో మార్పు వచ్చే వీలుందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News