కశ్మీర్ కాబోయే సీఎం ఆయనే.. తాత, తండ్రి కూడా సీఎంలే..
ఇక్కడ ట్విస్ట్ ఏమంటే.. ఆయన తండ్రి, తాత కూడా ఒకప్పుడు సీఎంలే.
ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికిల్ 370 రద్దు తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో జమ్ముకశ్మీర్ లో హంగ్ ఏర్పడుతుందని అందరూ అనుకుంటే ఓటర్లు మాత్రం స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ పార్టీల కూటమికి ఆధిక్యం కట్టబెట్టారు. దీంతోనే కాబోయే ముఖ్యమంత్రి ఎవరో తేలిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే.. ఆయన తండ్రి, తాత కూడా ఒకప్పుడు సీఎంలే. కశ్మీర్ తో వారి కుటుంబానికి విడదీయరాని సంబంధం ఉంది.
తాత మూడుసార్లు.. తండ్రి మూడుసార్లు
కశ్మీర్ లో అబ్దుల్లాల కుటుంబాలది పెద్ద చరిత్రే. రాజా హరిసింగ్ హయాంలోనే 1948లో కశ్మీర్ సీఎంగా నియమితులయ్యారు షేక్ అబ్దుల్లా. 1975, 1977లోనూ ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. షేక్ అబ్దుల్లా కుమారుడు ఫరూక్ అబ్దుల్లా కూడా మూడుసార్లు సీఎంగా చేశారు. తండ్రి మరణంతో 1983లో తొలిసారి, 1987లో రెండోసారి, 1996లో మూడోసారి బాధ్యతలు చేపట్టారు. ఇక ఫరూక్ కుమారుడు ఒమర్ అబ్దుల్లా 2009 నుంచి ఆరేళ్ల పాటు సీఎంగా వ్యహరించారు.
వారసుడు రెండోసారి
కశ్మీర్ లో 76 ఏళ్లలో దాదాపు 19 ఏళ్లు అబ్దుల్లాలే సీఎంలు. దీన్నిబట్టే కశ్మీర్ పై వారి ముద్రను తెలుసుకోవచ్చు. కాగా, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే.. వీరంతా లద్దాఖ్ కలిసి ఉన్న ఉమ్మడి జమ్మూ కశ్మీర్ కు సీఎంలుగా పనిచేశారు. ఇప్పుడు జమ్ము-కశ్మీర్ మాత్రమే ఉంది. లద్దాఖ్ అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా మిగిలింది. కశ్మీర్ అసెంబ్లీని కలిగి ఉంది. తాజా ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించడంతో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా రెండో సారి సీఎం కానున్నారు. ఇదే విషయాన్ని ఆయన తండ్రి, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా కూడా స్పష్టం చేశారు. అంటే.. స్వాతంత్ర్యం అనంతరం కశ్మీర్ రెండో సీఎం షేక్ అబ్దుల్లా కాగా.. విభజిత కశ్మీర్ తొలి సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నమాట.
పీడీపీ ఆశలు గల్లంతు
కశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ తో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ మంచి పని చేసింది. మరోవైపు మాజీ సీఎం మొహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. వాస్తవానికి కశ్మీర్ లో హంగ్ వస్తుందనే అంచనాతో ఫరూఖ్ అబ్దుల్లా మెహబూబా పార్టీ సాయం తీసుకుందామని భావించారు. అయితే, ఆ అవసరం ఏర్పడలేదు. నేరుగా అధికారంలోకి వచ్చేంత మెజారిటీ దక్కంది.