ఒకే వీధి.. రెండు తెలుగు రాష్ట్రాలు.. 2 ఎంపీ నియోజకవర్గాలు!

దూరంలో ఉండే అరకు లోక్ సభా నియోజకవర్గం పరిధిలోకి రావటం సిత్రం కాక మరేంటి?

Update: 2024-05-05 05:08 GMT

కొన్ని సిత్రాలు విన్నంతనే నిజమా అన్న భావన కలుగుతుంది. ఏపీలో ఒక కొస చివరగా ఉండే అరకు ఎంపీ నియోజకవర్గం.. మరో కొసకు ఉండే తెలంగాణలోని మహబూబాబాద్ లోక్ సభా నియోజకవర్గం. కానీ.. ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఒక వీధి ఉండటాన్ని ఊహించగలరా? తెలంగాణలోని ఒక వీధిలోని ఓవైపు దానికి 270కి.మీ. దూరంలో ఉండే అరకు లోక్ సభా నియోజకవర్గం పరిధిలోకి రావటం సిత్రం కాక మరేంటి?

ఇదంతా ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో కనిపిస్తుంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒకే వీధిలో ఓవైపు మహబూబాబాద్ ఎంపీ స్థానమైతే.. మరోవైపు అరకు ఎంపీ నియోజకవర్గం. రాజుపేటకు చెందిన శీలం శ్రీనివాస్ అనే వ్యక్తి ఇల్లు నిర్మించుకున్నారు. ఆయన ఇంటి నిర్మాణం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆయన ఇల్లు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా.. అరకు ఎంపీ స్థానం.. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వెళ్లిపోయింది.

రాజుపేట నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రమైన పాడేరు 270కి.మీ. దూరంలో ఉండటం గమనార్హం. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. శ్రీనివాస్ కుమారుడి పేరు జానకీరామ్. ఇతగాడు తన తండ్రి శ్రీనివాస్ ఇంటి ఎదురు వైపుగా ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసి ఇల్లు కట్టుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన ఇల్లు మహబూబాబాద్ ఎంపీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చేసింది. అంటే.. తండ్రి ఉండేది ఏపీలోని అరకు ఎంపీ స్థానమైతే.. ఆయన ఇల్లు ఎదురుగా ఉన్న కొడుకు ఇల్లు తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉంటుందన్న మాట. శ్రీనివాస్ నాలుగు అడుగులు వేస్తే.. ఏపీ నుంచి తెలంగాణ పరిధిలోకి వచ్చేస్తారన్నమాట. భలేగా ఉంది కదూ?

Tags:    

Similar News