వక్ఫ్ చట్టం వేళ చంద్రబాబు..నితీశ్ ను టార్గెట్ చేసిన ఓవైసీ

ఈ సందర్భంగా మరో కీలక వ్యాఖ్య చేశారు. చంద్రబాబు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి.. తన కొడుకు లోకేశ్ రాజకీయ భవితవ్యాన్ని దెబ్బ తీశారన్నారు.;

Update: 2025-04-14 05:37 GMT
Owaisi Slams Chandrababu Naidu Over Support for Waqf Bill

కొన్నిసార్లు అనవసరమైన బిల్డప్ లు చంద్రబాబు ఖాతాలో పడుతుంటాయి. ఇప్పుడు అలాంటిదే ఒకటి మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కారణంగా చంద్రబాబు ఖాతాలో పడింది. కేంద్రంలోని ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న టీడీపీ కారణంగానే వక్ఫ్ బిల్లు ఆమోదం పొందినట్లుగా ఓవైసీ మండిపడుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కారణంగానే వక్ఫ్ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినట్లుగా ఆరోపించారు. టీటీడీ బోర్డులో హిందువులను మాత్రమే సభ్యులుగా కొనసాగిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి.. వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులను సభ్యులుగా చేర్చే బిల్లుకు ఏ విధంగా మద్దతు ఇచ్చారంటూ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా మరో కీలక వ్యాఖ్య చేశారు. చంద్రబాబు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు మద్దతు ఇచ్చి.. తన కొడుకు లోకేశ్ రాజకీయ భవితవ్యాన్ని దెబ్బ తీశారన్నారు. భవిష్యత్తులో చంద్రబాబును ముస్లింలు ఎందుకు విశ్వసిస్తారని ప్రశ్నించారు. వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 25, 29లో పొందుపర్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని అసద్ మండిపడుతున్నారు. ఈ చట్టం ద్వారా ముస్లింల హక్కులన్నింటిని మోడీ సర్కారు లాక్కుందన్న ఆవేదనను వ్యక్తం చేశారు. దేశంలోని ముస్లింలకు వ్యతిరేకంగా మోడీ పని చేస్తున్నారన్న ఆయన.. వక్ఫ్ పై బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఫైర్ అయ్యారు.

హిందు.. జైన్.. సిక్కు.. ఎండోమెంట్ బోర్డుల్లో ఆ మత విశ్వాసాలను అనుసరించే వారిని మాత్రమే సభ్యులుగా ఉంటారని.. అలాంటప్పుడు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు సభ్యులుగా ఉండటం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకొని వక్ఫ్ భూములను అక్రమించిన వారికే వాటిని కట్టబెట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ చట్ట సవరణ వ్యతిరేకంగా ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో ఏప్రిల్ 19న దారుస్సలాంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ సభకు దేశ వ్యాప్తంగా మత పెద్దలు.. పలువురు రాజకీయ నేతలు హాజరవుతారన్న ఆయన.. వక్ఫ్ చట్ట వ్యతిరేక నిరసనలు శాంతియుతంగా ఉండాలన్న అసద్ మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

Tags:    

Similar News