చంద్రబాబు పీ-4 మంత్రం ఫలిస్తే.. ఏం జరుగుతుంది ..!
సీఎం చంద్రబాబు `పీ-4`(పబ్లిక్-ప్రైవేటు-ప్రభుత్వం-పార్టనర్‌షిప్) మంత్రం పఠిస్తున్న విషయం తెలిసిందే. దీనిని రెండు రకాలుగా ఆయన రాష్ట్రంపై అప్లయ్ చేస్తున్నారు.;
సీఎం చంద్రబాబు `పీ-4`(పబ్లిక్-ప్రైవేటు-ప్రభుత్వం-పార్టనర్‌షిప్) మంత్రం పఠిస్తున్న విషయం తెలిసిందే. దీనిని రెండు రకాలుగా ఆయన రాష్ట్రంపై అప్లయ్ చేస్తున్నారు. 1) అభివృద్ధి 2) పేదరిక నిర్మూలన. అభివృద్ధి విషయంలో పీ-4ను రహదారుల నిర్మాణం, చెరువులు, కుంటలు, నీటి ప్రాజెక్టుల బాగుచేత విషయంలో ఆచరణలో పెట్టారు. పీ-4 ద్వారా ఆయా సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాస్ట్ర స్థాయిలో రహదారుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇక, ఇప్పుడు పీ-4 ద్వారా పేదరిక నిర్మూలనపై మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ విషయంలో ఉగాది నుంచి మరింత వేగంగా అడుగులు వేయనున్నారు. తద్వారా.. రాష్ట్రంలోని పేదల సాధికారత కోసం ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నించనుంది. పేదలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు పీ-4 విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు. సమాజంలో ఆర్థికంగా అట్టడుగున ఉన్న వారికి మరింత చేయూతను ఇచ్చే ప్రయత్నం చేస్తారు. దీనికి సంబంధించి పీ-4(ఫ్యామిలీ ఎంపవర్‌మెంట్ - బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్)గా పేర్కొంటున్నారు.
ఏం చేస్తారు..
ఆర్థికంగా ఇప్పటికే అభివృద్ధి చెందిన కుటుంబాలను పీ-4 విధానంలో ప్రోత్సహిస్తారు. సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు వారు మద్దతుగా నిలబడేలా ప్రయత్నిస్తారు. తొలుత ఈ ప్రాజెక్టులో రాష్ట్రంలోని 4 గ్రామాలను ఎంపిక చేసి.. ఉగాది నుంచి పీ -4 విధానాన్ని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నా రు. దీని ద్వారా 5,869 కుటుంబాలకు లబ్ది చేకూరేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. లబ్ధి పొందే వారి పరిస్థితి ఎలా ఉన్నా.. వీరికి సాయం చేసేందుకు ముందుకు వచ్చేవారి విషయంలో ప్రభుత్వం ఒత్తిడి చేయదు.
ఆర్థికంగా ఉన్నతంగా ఉన్న కుటుంబాల వారు.. పేదరికంలో ఉన్నవారికి సాయం అందచేసేలా సర్కారు ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. లబ్దిదారుల ఎంపిక పూర్తి అయిన తర్వాత `సమృద్ధి బంధనమ్` అనే కొత్త ప్లాట్‌ఫామ్‌లో ఆయా కుటుంబాల వివరాలు పొందుపరుస్తారు. లబ్ది పొందాల్సిన కుటుంబాలతో సాయం చేసే కుటుంబాలను అనుసంధానిస్తారు. స్వచ్ఛంధంగా ఆయా కుటుంబాలు, వ్యక్తులు పేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చేలా వారికి రాయితీలు.. ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తారు. ఇది ఫలిస్తే.. రాష్ట్రంలో పేదరికం చాలా వరకూ తగ్గిపోతుం దని సీఎం చంద్రబాబు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.