నన్ను డ్రగ్స్ కేసులో ఇరికించే కుట్ర.. కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి.
గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఉద్రిక్తంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవల సియోల్ పర్యటన సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్ది రోజుల్లో కొంత మంది కీలక నేతల అరెస్టులు తప్పవంటూ బాంబు పేల్చారు. దాంతో అప్పటి నుంచి రాష్ట్రంలో ఉత్కంఠ వాతావరణ కొనసాగుతూనే ఉంది.
ఇదే క్రమంలో ఇటీవల కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫామ్‌హౌస్‌లో పర్మిషన్ లేకుండా పార్టీ జరపడం వివాదానికి దారితీసింది. అందులోనూ ఫారిన్ లిక్కర్ వినియోగించడం, డ్రగ్స్ ఆనవాళ్లు కూడా కనిపించినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు.. పార్టీకి హాజరైన ఓ పర్సన్ శాంపిల్స్ పరీక్షించగా డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పోలీసులు వెల్లడించారు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక అప్పటి నుంచి రాజ్ పాకాల పరారీలో ఉన్నారు. విచారణకు హాజరుకావాలంటూ ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు.
ఇక అప్పటి నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఇదే అంశంపై మాట్లాడుతూ బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే.. తాజాగా ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తనని డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేసి మరీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ మధ్య తనని కూడా డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నం చేశారని కౌశిక్ ఆరోపించారు. తన ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళ్తుంటే ఫోలీసులు తన ఫోన్‌ను ట్యాప్ చేశారని పేర్కొన్నారు. దాంతో వంద మంది సిబ్బందితోపాటు ఇద్దరు ఏసీపీలు, ఐదుగురు సీఐలు పార్టీ జరుగుతున్న స్థలానికి వచ్చారన్నారు. అక్కడున్న వారందరినీ సోదాలు చేశారని తెలిపారు. కానీ అక్కడ ఏమీ దొరకలేదని చెప్పారు. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని, తన మాటలే కనుక అబద్ధమైతే ఇంటెలిజెన్స్ ఐజీ ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అందరం కలిసే వెళ్దామని, అందరం ఒకేసారి టెస్టులు చేయించుకుందామని సవాల్ చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే సీఎం రేవంత్ ఇలాంటి కుట్రలకు తెరదీస్తున్నారని ఆరోపించారు.