వెంకటరెడ్డి టార్గెట్ రేవంత్ ప్రభుత్వం కూల్చివేత... కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలై పోయిన నేపథ్యంలో... తెలంగాణలో రాజకీయం రోజు రోజుకీ వేడెక్కిపోతోంది
లోక్ సభ ఎన్నికల పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలై పోయిన నేపథ్యంలో... తెలంగాణలో రాజకీయం రోజు రోజుకీ వేడెక్కిపోతోంది. ఈ సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరింది. సంచలన ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో కొన్ని ఆరోపణలు దెబ్బకు దెబ్బ అన్నట్లుగా ఉంటే... మరికొన్ని ఆరోపణలు మాత్రం శృతిమించి పోతుంటాయి. ఈ క్రమంలో తాజాగా బీఆరెస్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలు వైరల్ గా మారాయి!
అవును... లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో హీటెక్కి పోతున్నాయి. బయట ఉన్న ఎండవేడికంటే మరో రెండు మూడు డిగ్రీలు ఎక్కువగానే రాజకీయ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఈ సమయంలో... తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి బీఆరెస్స్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో భాగంగా... రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ సాయం అడిగారని కౌశిక్ రెడ్డి చెప్పారు.
ఇందులో భాగంగా... కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన దగ్గరికి ఓ మనిషిని పంపించారని.. ఈ క్రమంలో ఆయన వెంట 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారని.. కేసీఆర్ తో మాట్లాడాలని అన్నారని.. ఈ సమయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు కేసీఆర్ సాయం కావాలని అడిగారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో.. ఒక్కసారిగా ఈ విషయం వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా మైకుల ముందుకు వచ్చిన కౌశిక్ రెడ్డి... "నాతో 22మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.. కాస్త మీ సార్ తో మాట్లాడవయ్యా.. గవర్నమెంట్ ను పగలగొడదాము.. నేను ముఖ్యమంత్రిని అవుతాను అని చెబుతూ ఓ మనిషిని నా దగ్గరికి పంపించారు. కానీ నేను నమ్మలేదు. ఈ విషయాన్ని కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఎవరికీ చెప్పలేదు.. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద నాకు నమ్మకం లేదు. ఆయన రూమ్ లో ఒకటి మాట్లాడతాడు. బయటకు వెళ్లాక మరొకటి మాట్లాడతాడు" అని అన్నారు.
ఇదే సమయంలో... "మాకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చారు.. మిమ్మల్ని ప్రశ్నించమని బాధ్యత ఇచ్చారు.. కేసీఆర్ కూడా అదే విషయాన్ని చెప్పారు.. అందుకే నేనే ఈ విషయాన్ని వాళ్లకు చెప్పలేదు.. నేను నిజంగానే చెబుతున్నా.. ఈ కోమటిరెడ్డి వెంకట రెడ్డిని కచ్చితంగా మెంటల్ ఆసుపత్రికి తీసుకెళ్లాలి.. ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదు. మందు తాగి అసెంబ్లీకి వస్తాడు" అంటూ కంటిన్యూ చేసిన కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో వైరల్ గా మారింది.