అమెరికాకు 5, తెలంగాణకు 2... రేవంత్ అసంతృప్తిలో అర్ధముందంట!
అవును... ‘పద్మ’ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం "పద్మ" పురస్కారాలు ప్రకటించింది. ఇందులో 7 పద్మ విభూషణ్ లు, 19 పద్మభూషణ్ లతో పాటు 113 మందికి పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ఇలా మొత్తం 139 అవార్డులు ప్రకటించగా.. అందులో తెలంగాణకుకు సంబంధించిన వారు ఇద్దరిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది.
ఇందులో భాగంగా... పద్మ విభూషణ్ కు వైద్య రంగం నుంచి దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి ని, పద్మశ్రీ కి ప్రజా వ్యవహారాల కేటగిరీలో మందకృష్ణ మాదిగ ను ఎంపిక చేసింది. దీంతో... ఈ ఇద్దరితో పాటు ఈ అవార్డులకు ఎంపికైన తెలుగు వారికి అభినందనలు తెలిపిన రేవంత్.. ఈ విషయంలో కేంద్రం వివక్ష చూపిందంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.
అవును... ‘పద్మ’ పురస్కారాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపించిందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు చెందిన ఐదుగురు ప్రముఖుల పేర్లు ప్రస్థావించారు. ఇందులో భాగంగా.. గద్దర్, చుక్కా రామయ, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమల రావు వంటి ప్రముఖుల పేర్లు తెరపైకి తెచ్చారు.
ఈ పేర్లు ప్రస్థావిస్తూ.. ఇలాంటి ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినా.. కేంద్రం పరిగణలోకి తీసుకోలేదని.. ఇది కచ్చితంగా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను అవమానించడమేనని రేవంత్ మండిపడ్డారు. 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. తెలంగాణకు కనీసం 5 పురస్కారాలు కూడా ప్రకటించకపొవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు!
మరోపక్క పద్మ పురస్కారాలు పొందిన తెలుగువారికి రేవంత్ అభినందనలు తెల్లిపారు. ఇందులో భాగంగా... డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, నందమూరి బాలకృష్ణ, మంద కృష్ణ మాదిగ, మాడుగుల నాగఫణిశర్మ, కేఎల్ కృష్ణ, రాఘవేంద్రాచార్య పంచముఖి, దివంగత మిర్యాల అప్పారావులకు అవార్డులు దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు.
కాగా... కేంద్రం తాజాగా ప్రకటించిన "పద్మ" అవార్డుల్లో 10 మంది (ఒక పద్మవిభూషణ, ఒక పద్మభూషణ్, 8 మంది పద్మశ్రీ) విదేశీయులు ఉంటే వారిలో 5 మంది అమెరికా దేశస్తులు కావడం గమనార్హం. ఇక మిగిలినవారిలో జపాన్, కెనడా, ఫ్రాన్స్, బ్రెజిల్, కువైట్ దేశాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
దీంతో... రేవంత్ రెడ్డి అసంతృప్తిలో అర్ధం ఉంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.