తెలంగాణ బీజేపీకి 'పైడి' తంటా.. ఏం జరిగింది?
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులను ఉద్దేశిం చి ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్‌లో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటన సహా దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యానికి తోడు.. పైడి రాకేష్ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదంగా మారాయి.
రాష్ట్రంలో హిందూ ఆలయాలపైనే దాడులు ఎందుకు జరుగుతున్నాయన్న పైడి.. ముస్లింలు, ఇతర మతస్థుల ఆలయాలపై ఎందుకు దాడులు జరగడం లేదని నిలదీశారు. దీనికి కారణం హిందువుల్లో చీము నెత్తురు లేకపోవడమేనని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ``హిందువుల్లో మగతనం చచ్చిపోయింది. సిగ్గు లేదు. చీము నెత్తురు అంతకన్నా లేదు. ఇన్ని దాడులు జరుగుతుంటే.. ఒక్కరూ స్పందించడం లేదు. ఒక్క నిరసన కూడా వ్యక్తం చేయడం లేదు`` అని పైడి నోరు జారారు.
అయితే.. పైడి వ్యాఖ్యలపై ధార్మిక సంస్థలు, హిందూ సంఘాల నాయకులు నిప్పులు చెరిగారు. పైడి ఏదో వ్యక్తిగత అజెండాను మోస్తున్నారని, కేవలం తాను మాత్రమే హిందువులకు గొడుగు పడుతున్నట్టు వ్యాఖ్యానిస్తున్నారని చాలా మంది ఎద్దేవా చేశారు. ఇలాంటి నాయకులను కంట్రోల్ చేసుకోవాలని మరింత మంది బీజేపీకి సూచించారు. ఇంకొందరు స్పందిస్తూ.. పైడికి ఓట్లేసిన వారంతా హిందువులేనా అని ప్రశ్నించారు.
ఇక, పైడి చేసిన వ్యాఖ్యలపై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇక, పైడి వ్యాఖ్యలపై బీజేపీ కూడా సీరియస్ అయింది. ఇలాంటి వ్యాఖ్యలతో హిందూ సమాజంలో బీజేపీ పలుచన అవుతుందని, కేంద్ర మంత్రి బండి సంజయ్ తన వారి వద్ద వ్యాఖ్యానించారు. పార్టీ చీఫ్ కేంద్ర మంత్రికిషన్ రెడ్డికి చెప్పి.. పైడిని కంట్రోల్ చేయాల్సి ఉందని తెలిపారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.