జైలుకి వెళ్తే... ఇండియా అయినా పాక్ అయినా సేం రిజల్ట్?

కాగా... పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉండగా.. ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి

Update: 2024-02-10 03:57 GMT

ఎన్నో భయంకర సంఘటనలు, బాంబు దాడులు, తుపాకీ చప్పుళ్లు, మృత్యుఘోషలు, ఆర్తనాధాలు నడుమ ముగిసిన పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఈ దఫా డిఫరెంట్ ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ అనూహ్య ఫలితాలతో ఈసారి పాకిస్థాన్ లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మరోపక్క ఇమ్రాన్ ఖాన్ తరుపు అభ్యర్థులు మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామే అని గట్టి నమ్మకంతో ఉండటం గమనార్హం.

అవును... పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో భాగంగా... ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఎదుర్కొంటూ జైలులో ఉన్న ఇమ్రాన్‌ ఖాన్‌ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు విజయఢంకా మోగిస్తున్నారు. అక్కడ బ్యాలెట్‌ పత్రాల లెక్కింపు నెమ్మదిగా కొనసాగుతుండటంతో ఇంకా పూర్తి ఫలితాలు వెల్లడి కాలేదు. అయితే... ప్రస్తుత ఫలితాల సరళి చూస్తుంటే మాత్రం హంగ్‌ ఏర్పడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఇప్పటివరకూ వెళ్లడైన ఫలితాల ప్రకారం చూసుకుంటే... ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీకి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థులు సొంతం చేసుకోవచ్చని తెలుస్తుంది. ఇక రెండో స్థానంలో నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ - నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) నిలిచే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ క్రమంలో... నాలుగోసారి ప్రధాని పదవిని అధిష్ఠించాలనుకుంటున్న నవాజ్‌ షరీఫ్‌.. బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)తో కూటమిగా జతకట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన షరీఫ్‌... జాతీయ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా పీఎంఎల్‌-ఎన్‌ అవతరిస్తుందని పేర్కొన్నారు. సంకీర్ణ సర్కారు ఏర్పాటుకు ముందుకు రావాలంటూ వివిధ రాజకీయ పక్షాలకు పిలుపునిచ్చారు.

కాగా... పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో 336 సీట్లు ఉండగా.. ఇందులో 266 స్థానాలకు నేరుగా ఎన్నికలు జరుగుతాయి. మిగిలిన 70 స్థానాలను మైనారిటీలకు, మహిళలకు కేటాయిస్తారు. అయితే ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో 265 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ప్రభుత్వం ఏర్పరచాలంటే మ్యాజిక్ ఫిగర్ 133! ఈ క్రమంలో 265 స్థానాలకు గానూ 226 స్థానాల ఫలితాలను పాకిస్థాన్‌ ఎన్నికల సంఘం ప్రకటించింది.

వీటిలో ఇమ్రాన్‌ ఖాన్ బలపరిచిన అభ్యర్థులు 92 సీట్లలో విజయం సాధించారు. ఇక నవాజ్ షరీఫ్ పార్టీ... పీఎంఎల్‌-ఎ న్‌ 64, బిలావల్‌ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పీపీపీ 50, ఇతర చిన్న పార్టీలు 20 స్థానాలు సొంతం చేసుకున్నాయి. ఈ నేపథుయంలోనే పీపీతో జతకట్టాలని షరీఫ్ భావిస్తున్నారని తెలుస్తుంది. మరోపక్క ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ అభ్యర్థులు మాత్రం.. తాము ఎవరితోనూ జత కట్టబోమని, సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News