పాకిస్థాన్‌ పై మరోసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌.. కీలక కమాండర్‌ హతం!

గతంలో పాకిస్థాన్‌ భూభాగంలోకి వెళ్లి భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే

Update: 2024-02-24 10:27 GMT

గతంలో పాకిస్థాన్‌ భూభాగంలోకి వెళ్లి భారత్‌ సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చేపట్టిన ఈ సర్జికల్‌ స్ట్రైక్స్‌ లో పాకిస్థాన్‌ లోని పలు ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి. పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇప్పుడు భారత్‌ కోవలోనే పాకిస్థాన్‌ పొరుగు దేశం ఇరాన్‌ కూడా పాక్‌ పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేపట్టింది. పాకిస్థాన్‌ లో ఉన్న బలూచిస్థాన్‌ లోని మిలిటెంట్‌ గ్రూప్‌పై ఇరాన్‌ చేసిన దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్‌ సైతం దాడి చేసింది. దీంతో ఇరాన్‌ – పాకిస్థాన్‌ ల మధ్య ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.

ఒకరిపై ఒకరు జరిపిన ఈ సర్జికల్‌ స్ట్రైక్స్‌ తో ఇరాన్, పాకిస్థాన్‌ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్‌ భూభాగంలో ఇరాన్‌ మరోసారి మిలిటరీ ఆపరేషన్‌ కు దిగింది. ఇరాన్‌ దాడిలో ఉగ్రవాద సంస్థ.. ‘జైష్‌ అల్‌ అదిల్‌’ కమాండర్‌ ఇస్మాయిల్‌ షాబాక్ష్ మరణించారు. ఈ మేరకు ఇరాన్‌ అధికార మీడియా వెల్లడించింది. అలాగే ఇస్మాయిల్‌ షాబాక్ష్ అనుచరులు కొందరిని కూడా అంతమొందించినట్లు ప్రకటించింది.

కాగా జైల్‌ అల్‌ అదిల్‌ సంస్థ ఉగ్రవాదులు ఇరాన్‌ భద్రతా బలగాలపైనే దాడులు చేయడం ప్రారంభించారు. గతేడాది డిసెంబర్‌లో ఇరాన్‌ లోని సిస్తాన్‌ బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ లోని ఓ పోలీస్‌స్టేషన్‌పై జరిగిన దాడిలో 11 మంది పోలీసులు చనిపోయారు. ఈ దాడి చేసింది తామేనని జైష్‌ అల్‌ అదిల్‌ ప్రకటించుకుంది. గత నెలలో పరస్పరం మిసైల్‌ దాడులకు దిగడంతో ఇరాన్, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ దాడుల తర్వాత ఇరాన్, పాకిస్థాన్‌ మధ్య భద్రతా సహకారం విషయమై ఒప్పందం కూడా జరిగింది. ఈ విషయమై రెండు దేశాల విదేశాంగ మంత్రులు సంయుక్త మీడియా సమావేశం కూడా నిర్వహించారు. వెనక్కి పిలిచిన ఇరు దేశాల రాయబారులను తిరిగి వారి స్థానాల్లో నియమించారు.

గత నెలలో కూడా ఇరాన్‌ ఇదే తరహాలో పాకిస్థాన్‌ లో దాడులు చేసిన సంగతి తెలిసిందే. బలూచిస్థాన్‌ ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ‘జైష్‌ అల్‌ అదిల్‌’ ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు ప్రధాన కార్యాలయాలపై డ్రోన్లు, క్షిపణులతో దండెత్తింది.

దీంతో రెచ్చిపోయిన పాకిస్థాన్‌ ఆ మరుసటిరోజే ఇరాన్‌ పై ప్రతీకార దాడులు చేపట్టింది. ఇరాన్‌ లోని సిస్థాన్‌–ఒ–బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ లోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేసినట్లు పాక్‌ విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో జైష్‌ అల్‌ అదిల్‌ టెర్రరిస్టులపై పాకిస్తాన్‌ భూభాగంలో ఇరాన్‌ బలగాల దాడి మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీసింది.

కాగా ఉగ్రవాద సంస్థ... ‘జైష్‌ అల్‌ అదిల్‌’ సున్నీ మిలిటెంట్‌ గ్రూపు. పాకిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తూ ఇరాన్‌ లోని సిస్థాన్‌–బలూచిస్థాన్‌ లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో హమాస్‌–ఇజ్రాయెల్‌ ఘర్షణలతో ప్రపంచ పరిణామాలు వేడెక్కాయి. ఈ సమయంలో ఇరాన్‌–పాక్‌ ఘర్షణపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

Full View
Tags:    

Similar News