ఒక్క నిమ్మకాయ రూ.5.9లక్షలు.. ఎందుకంత విలువ అంటే?

తమిళనాడులోని పుదుకోట్టై జిల్లా తిరువరంగుళం వల్లనాట్టు చెట్టియార్ వర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది.

Update: 2025-02-15 07:30 GMT

ఒక నిమ్మకాయ రేటు ఎంత ఉంటుంది? రూ.5 కాదంటే రూ.10. కానీ.. తమిళనాడులో ఒక నిమ్మకాయను సొంతం చేసుకోవటానికి పోటాపోటీ పడటమే కాదు చివరకు రూ.5.9లక్షల భారీ మొత్తాన్ని వెచ్చించి మరీ సొంతం చేసుకున్నారు. ఇంతకూ సదరు నిమ్మకాయ స్పెషాలిటీ ఏమిటి? దాని కోసం అంతలా పోటీ ఎందుకు పడ్డారు? లాంటి వివరాల్లోకి వెళితే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.

తమిళనాడులోని పుదుకోట్టై జిల్లా తిరువరంగుళం వల్లనాట్టు చెట్టియార్ వర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఆ వర్గీయులు ‘‘తైపూస’’ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ ఉత్సవాలు ముగిసిన తర్వాతి నుంచి మూడు రోజులపాటు పళనిలో బస చేయటం.. పలు కార్యక్రమాల్లో పాల్గొనటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవం కోసం తమిళనాడు వ్యాప్తంగా ఉన్న చెట్టియార్ లలోని కొన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటారు.

ఈ ఏడాది 300 మందికి పైగా చెట్టియార్ వర్గీయులు పళనికి వెళ్లి తైపూసం ఉత్సవాన్ని ఘనంగా నిర్వమించారు. ఉదయం.. మధ్యాహ్నాం.. రాత్రి అన్నదానం చేసే సమయంలో స్వామి దర్శన వేళలో ఒక్కో నిమ్మకాయను పెట్టి పూజలు చేస్తారు. ఆ నిమ్మకాయల్ని గురువారం పెరియనాయకి అంబాల్ ఆలయం వద్ద వేలం వేశారు. ఇక్కడో నిబంధన ఉంది. ఈ వేలంలో కేవలం చెట్టియార్ వర్గీయులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతిస్తారు. అన్నదానం వేళలో పూజలో ఉంచిన ఒక్కో నిమ్మకాయ కనిష్ఠంగా రూ.16వేలు.. గరిష్ఠంగా రూ.40వేల వరకు పలికాయి.

ఇక.. తైపైసం రోజున పళని మురుగన్ వద్ద పూజలో ఉంచిన అభిషేక నిమ్మకాయను సొంతం చేసుకోవటానికి పోటీ పడ్డారు. వారిలో ఒకరు పూజలో ఉంచిన నిమ్మకాయను రూ.5.9 లక్షలు వరకు పాడి సొంతం చేసుకున్నారు. దేవుడి వద్ద ఉంచిన సదరు నిమ్మకాయ పవర్ ఫుల్ అని.. దానిని సొంతం చేసుకున్న వారికి శుభాలు చేకూరుతాయన్న సెంటిమెంట్ ఉంది. అందుకే.. అంత భారీ మొత్తానికి వేలంలో వెచ్చించి సొంతం చేసుకున్నారు. మంత్రాలకు చింతకాయలు రాలవన్న సామెత నిజమే..కానీ నమ్మకాలకు మాత్రం లక్షలాది రూపాయిలు పలుకుతాయని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News