పల్లవి ప్రశాంత్ కు ఊరట... సరేకానీ...!
బిగ్ బాస్ - 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేయడం, అనంతరం కోర్టు అతడికి 14రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే
బిగ్ బాస్ - 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేయడం, అనంతరం కోర్టు అతడికి 14రోజుల రిమాండ్ విధించడం తెలిసిందే. ఈ సమయంలో అతడి తరుపు న్యాయవాది బెయిల్ కు దరఖాస్తు చేసుకోగా... తాజాగా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇది ప్రస్తుతానికి ఊరట అనే అనుకున్నప్పటికీ... ఈ విషయంలో పోలీసులు వినిపిస్తున్న వెర్షన్ మాత్రం... జరిగిన అల్లరంతటికీ అతడే కారణం అన్నట్లుగా ఉంది!
అవును... బిగ్ బాస్ - 7 విజేత ప్రకటన అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణానగర్ బస్ స్టాప్ వద్ద జరిగిన రచ్చకు సంబంధించి ఫైల్ అయిన కేసులో అరెస్టైన పల్లవి ప్రశాంత్ కు ఊరట లభించింది. ఇందులో భాగంగా అతడికి హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అనంతరం... ఆదివారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
బెయిల్ సంగతి అలా ఉంటే... ఈ కేసుకు సంబంధించి స్పందించిన జూబ్లీహిల్స్ పోలీసులు... ఈ గొడవంతటికీ పల్లవి ప్రశాంత్ అత్యుత్సాహమే కారణం అని చెబుతున్నారు! ఇందులో భాగంగా బిగ్ బాస్ ఫినాలే అనంతరం ఘర్షణలు తలెత్తడానికి పల్లవి ప్రశాంత్ కారణమని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... పల్లవి ప్రశాంత్ ను బిగ్ బాస్ - 7 విజేతగా ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద హంగామా ఏర్పడిందని అన్నారు. ఈ సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో అతడిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని ముందే చెప్పి.. అతడిని వేరే దారిలో పంపించామని తెలిపారు. అయితే... పాపులారిటీ కోసం అతడు మళ్లీ వచ్చి అక్కడున్న వారిని రెచ్చగొట్టాడని తెలిపారు!
అతడు మళ్లీ వెనక్కి తిరిగి రావడంతో అక్కడ ఎక్కువమంది గుమిగూడి ఘర్షణలు తలెత్తడానికి కారణమయ్యాడని పోలీస్ అధికారి తెలిపారు. అలా ఆ రోజు రాత్రి జరిగిన విధ్వంసంలో టీఎస్ ఆర్టీసీకి చెందిన ఆరు బస్సులు దెబ్బతిన్నాయని, పోలీసు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని వెల్లడించారు. ఇదే సమయంలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారని పేర్కొన్నారు.
ఈ ఘటనకు సంబంధించి రెండు కేసులు నమోదు చేశామని తెలిపిన డీసీపీ... మొదటి కేసులో పల్లవి ప్రశాంత్ సహా ముగ్గురిని అరెస్టు చేయగా.. మరొకరు పరారీలో ఉన్నాడని తెలిపారు. రెండో కేసులో ఇప్పటివరకు 16 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించినట్లు చెప్పారు. వారిలో నలుగురు మైనర్లు అని అన్నారు! ఈ క్రమంలో రిమాండ్ లో ఉన్న పల్లవి ప్రశాంత్ కు తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది!