బూతులతో బండారు బూమరాంగ్...దూకుడు పెంచిన పంచకర్ల !

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు పంచకర్ల రమేష్ బాబు. ఆయనను పార్టీలోకి తీసుకోవడం వెనకే పెందుర్తు సీటు హామీ ఉందని అంటున్నారు.

Update: 2023-10-12 02:30 GMT

పెందుర్తి సీటు విషయంలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య ఒక రకమైన వార్ సాగుతోంది. ఆ ఇద్దరూ మొదట్లో వేరే పార్టీ వారు. మధ్యలో ఒకే పార్టీలో కలసి పనిచేశారు. ఇపుడు మళ్ళీ వేరు వేరు పార్టీలలో ఉన్నారు. అందులో ఒకరు మాజీ మంత్రి సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి అయితే రెండవ వారు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. 2009లో పంచకర్ల రమేష్ ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి మరీ సీనియర్ టీడీపీ నేత బండారుని ఓడించారు.

ఆ తరువాత 2014 నాటికి పంచకర్ల టీడీపీలో చేరిపోయారు. అదే పెందుర్తి సీటు కోరుకున్నా యలమంచిలి సీటుని చంద్రబాబు ఇచ్చారు. సర్దుకుపోయి పోటీ చేసి గెలిచి వచ్చారు. 2019లో సైతం పంచకర్లకు పెందుర్తి సీటు దక్కలేదు. యలమంచిలిలోనే పోటీ చేసి ఓడిపోయారు. ఇక లాభంలేదు అనుకుని వైసీపీలోకి వచ్చారు. అక్కడా పెందుర్తి సీటుకు చుక్కెదురు అయింది. చివరిగా జనసేనను ఎంచుకున్నారు.

ఎటూ ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉంది కాబట్టి పుట్టింటి పార్టీగానే జనసేనను ఆయన భావిస్తున్నారు. దాంతో ఆయన జనసేనలో చేరకముందే క్యాడర్ కి పెందుర్తి నుంచే ఈసారి పోటీ అని చెప్పేసారు. అయితే అక్కడ టీడీపీ నుంచి బండారు ఉన్నారు. దాంతో ఎలా అని అంతా అనుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యలో జనసేన టీడీపీ పొత్తులను పవన్ కళ్యాణ్ ప్రకటించేశారు.

దాంతో బండారు స్పీడ్ ఒక్కసారిగా పెంచేశారు. అధినాయకత్వాన్ని మంచి చేసుకునే క్రమంలో ఆయన మహిళా మంత్రి రోజా మీద బూతులు మాట్లాడారు. దాంతో ఆయన ఒకటి తలిస్తే వేరొకటి జరిగింది. టోటల్ గా బూమరాంగ్ అయింది. ఇపుడు బండారు బదనాం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కుతుందా లేదా అన్న డౌట్ లో ఆయన ఉంటే పంచకర్ల ఇదే అదనుగా భావించి జోరు పెంచేశారు.

ఆయన లోకల్ గా జరిగే కార్యక్రమాలను అటెండ్ అవుతున్నారు. క్యాడర్ ని వెంటబెట్టుకుని మరీ పర్యటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేయబోతున్నాను అని కూడా చెప్పేస్తున్నారు. ఇక చూస్తే మొన్నటిదాకా పెద్దాయన బండారు అని ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు వియ్యంకుడు అని కొంత ప్లస్ అయ్యే చాన్స్ కనిపించేది. కానీ ఇపుడు ఆయన బూతుల బండారుగా మారిపోయారని అంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో ఆయనకు టికెట్ ఇస్తే మహిళా ఓటు బ్యాంక్ అన్న లెక్కలను ఆయన అంటే గిట్టని వారు సొంత పార్టీలోనే చూపిస్తున్నారుట.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడు పంచకర్ల రమేష్ బాబు. ఆయనను పార్టీలోకి తీసుకోవడం వెనకే పెందుర్తు సీటు హామీ ఉందని అంటున్నారు. పైగా అది 2009లో ప్రజరాజ్యం పార్టీ గెలిచిన సీటు. ఇలా సెంటిమెంట్లు ఒక వైపు సన్నిహితుడు మరో వైపు దాంతో పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెందుర్తి పొత్తూల్లో వదులుకోరు అని అంటున్నారు.

అలా పంచకర్ల నోట్లో పంచదార పోసినట్లుగా పెందుర్తి సీటు వచ్చి ఒడిలో పడుతోంది అని అంటున్నారు. మొత్తానికి బండారు ఎత్తులు అన్నీ చిత్తు కాగా ఇపుడు టికెట్ ఎలా వస్తుంది అన్నది తెలియడం లేదు అంటున్నారు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప పెందుర్తి సీటు జనసేనదే అని అంటున్నారు అంతా.

Tags:    

Similar News