జోరుగా పందెం కోళ్ల దొంగతనాలు...పోలీసులు చెబుతున్న సలహా ఇదే!

తెలుగు లోగిళ్ళలో అతి పెద్ద పండగ సంక్రాంతికి ఇంక మధ్యలో ఒక్క నెల మాత్రమే సమయం ఉన్న సంగతి తెలిసిందే

Update: 2023-11-06 11:48 GMT

తెలుగు లోగిళ్ళలో అతి పెద్ద పండగ సంక్రాంతికి ఇంక మధ్యలో ఒక్క నెల మాత్రమే సమయం ఉన్న సంగతి తెలిసిందే. ఈ పండగ వస్తుందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో కోడిపందాలు హడావిడి అంతా ఇంతా కాదు. ప్రధానంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల సందడి గురించి చెప్పేపనే లేదు. సందడే సందడీ అన్నట్లుగా సాగుతుంది అక్కడ వ్యవహారం. దీంతో పందెంకోళ్ల పెంపకం దారులు ఫుల్ బిజీలో ఉంటే... వారికి అనుకోని కష్టం వచ్చిపడింది.

అవును... సంక్రాంతి పండక్కి జరిగే పందెంకోళ్ల పెంపకం జోరుగా జరుగుతుంది. వాటి యజమానులు వాటికి ఫుల్ గా ఫుడ్ పెడుతూ, ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలో వారికి అనుకోని కష్టం వచ్చిపడింది. ప్రతి యేటా సంక్రాంతి పండుగకు ఏపీలో, ప్రధానంగా గోదావరి జిల్లాలో పెద్ద యెత్తున కోడిపందాలు జరుగుతాయి. పండుగ మూడు రోజుల పాటు పందాల పేరుతో కోట్ల రూపాయల నగదు చేతులు మారుతాయి!

భారీ ఎత్తున ఏర్పాటు చేసిన బరి లో బాహుబలి - బళ్లాలదేవ టైంపులో పందెంకోళ్లు ఫైట్ చేసుకుంటుంటాయి. ప్రేక్షకుల కేరింతలు, హర్ష ధ్వానాలు, బెట్టింగ్ వేసిన్వారి టెన్షన్ ల మధ్య ఈ పందెంకోళ్ల పోరాటాలు రసవత్తరంగా సాగుతుంటాయి. అలాంటి పందాల కోసం పోటీ పడే పందెం కోళ్లు లక్షల రూపాయలు కూడా పలుకుతాయి. ఇక ఒక మోస్తరు పందెంకోడి పెంపకానికి సుమారు 25 వేల వరకు ఖర్చు అవుతుందని అంటారు.

ఈ క్రమంలో పక్కా ప్రొఫెషనల్స్ పెంచిన కోడి పుంజులను వాటి రంగు, ఎత్తు, ఫైటింగ్ చూసి 50 వేల నుంచి 5 లక్షల వరకు వాటిని అమ్ముతారు. ఈ స్థాయిలో ఆ కోళ్లను పెంచే పెంపకం దారులకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చిపడింది. కారణం... పందెం కోళ్ల దొంగతనాలు జోరుగా జరుగుతున్నాయి. అవును... ఇప్పుడు పందెంకోళ్ల పెంపకం జరిగే చోట్ల దొంగలు పడుతున్నారు. దీంతో కోళ్ల పెంపకందారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇటీవల ఎంతో కష్టపడి పెంచిన పుంజులను నూజివీడు పరిసర ప్రాంతాల్లో రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. దీంతో కోళ్ల పెంపకం దారులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగా... నూజివీడు మండలం రావిచర్లకు చెందిన మోత్కుమిల్లి శ్రీనివాసరావు దంపతులను దొంగలు కత్తితో బెదిరించి మరీ 4 లక్షలు విలువ చేసే పందెం పుంజులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

మరోపక్క కోళ్ల పెంపకం దారులు ఫాం ల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో ఫాం పరిశర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే, రెక్కీకి తిరుగుతున్నట్లు అనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా త్వరలోనే కోళ్ల దొంగలను పట్టుకుంటామని చెబుతున్నారు. దీంతో మిగిలిన ప్రాంతాల్లో యజమానులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారని తెలుస్తుంది.

Tags:    

Similar News