వంశీకి ప్రాణహాని.. జైల్లో మెంటల్ టార్చర్ : భార్య పంకజశ్రీ షాకింగ్ కామెంట్స్
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన భార్య పంకజశ్రీ ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వంశీని ములాఖత్ లో కలిసిన ఆమె అనంతరం పంకజశ్రీ మీడియాతో మాట్లాడారు. వంశీని మెంటల్ గా టార్చర్ చేస్తున్నారని, నిరాధార కేసులో అన్యాయంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారని, త్వరలో జైలులో వంశీని కలుస్తానని చెప్పారని పంకజశ్రీ వెల్లడించారు.
వంశీపై పోలీసులు తప్పుడు కేసును నమోదు చేశారని, ఆయనపై మోపిన అభియోగాలు అన్నీ అవాస్తవాలేనంటూ పంకజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ జైల్లో వంశీకి ప్రాణహాని ఉంది. ఆయనను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వెన్ను నొప్పితో బాధపడుతున్న వంశీకి కనీసం బెడ్ కూడా ఇవ్వలేదు. మంచం ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని కోర్టులో పిటిషన్ వేస్తామంటూ పంకజశ్రీ చెప్పారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్తకు జైలులో వైద్యం చేయించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
వంశీకి వెన్నునొప్పితోపాటు శ్వాసకోస సమస్యలు ఉన్నాయి. నేలపై పడుకోవడం వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారని ఆమె తెలిపారు. జైలులో ఎవరినీ కలవకుండా చేస్తున్నారని, ఆయన ఉన్న బ్యారక్ లో 60 సీసీ కెమెరాలు పెట్టారని తెలిపారు. వంశీ ఆరోగ్యంపై డాక్టర్లు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కోర్టులో ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా, వైసీపీ పార్టీ తరపున తమకు అన్ని సహాయ సహకారాలు అందుతున్నాయని పంకజశ్రీ తెలిపారు. పార్టీ నుంచి న్యాయ సహాయం అందిస్తామని అధినేత జగన్ తనకు చెప్పారన్నారు.