తోపుదుర్తి ట్రాప్ లో జగన్: పరిటాల సునీత
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ సీనియర్ నేత, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన ఆరోపణలు చేశారు.;

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ సీనియర్ నేత, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన ఆరోపణలు చేశారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ పాత్ర కూడా ఉందని, గతంలో ఆయనను సీబీఐ విచారణ కూడా చేసిందని షాకింగ్ ఆరోపణలు చేశారు. అనంతపురం పర్యటనకు వస్తున్న జగన్ సూట్ కేసు బాంబుల గురించి చెప్పాలని, అలాగే పరిటాల రవిని చంపించేందుకు మనిషిని ఎవరు పంపించారో చెప్పాలని సునీత డిమాండ్ చేశారు. పరిటాల రవిని చంపినపుడు వైఎస్ సీఎంగా ఉన్నారని, దాంట్లో జగన్ కూడా ఉన్నారని ఆయనను సీబీఐ విచారణ జరిపిందని గుర్తు చేశారు.
వైఎస్ హయాంలో అనంతపురంలో 45 మందిని పొట్టనబెట్టుకున్నారని, వారికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్ పై ఉందని అన్నారు. శుక్రవారం ఆయనకు బాగా అచ్చొస్తుంది కాబట్టి శుక్రవారం వస్తున్నారేమో అని ఎద్దేవా చేశారు. తోపుదుర్తికి సంబంధించిన మహేశ్వర్ రెడ్డిని దారుణంగా చంపి రైలు పట్టాలపై శవాన్ని పెట్టారని, ఆ హత్య వెనుక తోపుదుర్తి సోదరులు ఉన్నారని ఆరోపించారు. మరో టీడీపీ కార్యకర్త మోహన్ రెడ్డిని ఇంటికి వెళ్లి కొడవళ్లతో నరికారని, ఆయనను కూడా పరామర్శించాలని అన్నారు.
జగన్ వచ్చేటప్పుడు లగేజ్ లో బట్టలు ఎక్కువ తెచ్చుకోవాలని, ఐదేళ్ల వైసీపీ పాలనలో తోపు ఎమ్మెల్యేగా ఉన్నపుడు వైఎస్సార్ సీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు నష్టపోయారని, తోపు వల్ల నష్టపోయిన కుటుంబాలను పరామర్శించే బాధ్యత కూడా జగన్ పై ఉందని పరిటాల సునీత చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.
రాప్తాడులో తోపుదుర్తి సోదరులు ముఠా కక్షలను రెచ్చగొడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. ఓబుల్ రెడ్డి, మద్దెలచెరువు సూరి కుటుంబాలను ఫ్యాక్షనిజంలోకి లాగుతున్నారని ఆరోపించారు.
తోపుదుర్తి సోదరుల మాటలు నమ్మి ఈ కుట్రలో భాగస్వామ్యం కావొద్దని కనుముక్కల ఉమ, గంగుల భానుమతికి సునీత విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్షన్ కారణంగా మన 3 కుటుంబాలు చాలా నష్టపోయాయని, కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని గుర్తు చేశారు.
తోపుదుర్తి సోదరులు ఏం చెప్పినా జగన్ నమ్మేస్తున్నారని, ఐదేళ్లు సీఎంగా చేసిన జగన్ నిజానిజాలు తెలుసుకోరా అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ చిచ్చు పెట్టవద్దని జగన్ కు స్పష్టం చేస్తున్నానని పరిటాల సునీత అన్నారు.