ధర్మవరం టికెట్ ఫైట్.. సూరి వర్సెస్ పరిటాల!
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ధర్మవరం. ఈ టికెట్ కోసం టీడీపీ యువ నేత, పరిటాల వారసుడు పరిటాల శ్రీరాం పట్టుబడుతున్న విషయం తెలిసిందే.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం ధర్మవరం. ఈ టికెట్ కోసం టీడీపీ యువ నేత, పరిటాల వారసుడు పరిటాల శ్రీరాం పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన టీడీపీ ఇంచార్జ్‌గా ఇక్కడ ఉన్నారు. అయితే.. ఈ టికెట్‌ను టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత బీజేపీ బాటపట్టిన గోనుగుంట్ల సూర్యనారాయణ, ఉరఫ్ వరదాపురం సూరి ఆశిస్తున్నారు. టీడీపీ.. బీజేపీతో జట్టు కడితే.. ఈ టికెట్ ఆయనకే వెళ్లనుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఒకవేళ బీజేపీతో జట్టకట్టక పోయినా.. తిరిగి టీడీపీలోకి వచ్చి .. ఈ టికెట్ను దక్కించుకోవాలని సూరి భావిస్తున్నారు.
ఈ వ్యూహాన్ని పరిటాల శ్రీరాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నియోజకవర్గానికి నాలుగున్నరేళ్లుగా తాను ఇంచార్జ్‌గా ఉన్నానని.. ఇప్పుడు వేరేవారికి ఎలా అవకాశం ఇస్తారని కొన్నాళ్లుగా ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇదే తరచుగా వివాదాలకు దారితీస్తోంది. ఇక, ఇప్పుడు నేరుగా ఇరు పక్షాలు రోడ్డెక్కడం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఆధిపత్య రాజకీయాలను బహిర్గతం చేసింది. ఎట్టి పరిస్థితిలోనూ సూరికి ఇవ్వరాదనేది శ్రీరాం మాట. ఇదే విషయాన్ని ఆయన కొన్నేళ్లుగా టీడీపీలోనూ చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సూరి రాకను అడ్డుకుంటానని శ్రీరామ్ పదేపదే వార్నింగ్ ఇవ్వడం తెలిసిందే.
ఇదిలావుంటే, సోమవారం పెనుకొండలో నిర్వహించిన టీడీపీ కీలక ప్రచార కార్యక్రమం 'రా.. కదిలిరా' సభకు వరదాపురం సూరి కూడా జనాన్ని తరలించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే.. బీజేపీకి చెందిన సూరి తమ పార్టీ కార్యక్రమానికి జనాన్ని తరలించడంపై పరిటాల శ్రీరామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా పార్టీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య వంటి వారు కూడా ఇక్కడ పాల్గొననుండడంతో వారిని మచ్చిక చేసుకునేందుకు సూరి ప్రయత్నిస్తున్నారని శ్రీరాం భావిస్తున్నారు.
సూరి తరలిస్తున్న వాహనాలను బత్తెలపల్లి వద్ద పరిటాల శ్రీరామ్ అనుచరులు అడ్డుకున్నారు. ఇరువర్గాల వారు పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో 10 వాహనాలు ధ్వంసమయ్యాయి. టీడీపీ శ్రేణులు రోడ్డుపై నిరసనకు దిగాయి. ధర్మవరం టికెట్ విషయమై పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి మధ్య రానున్న రోజుల్లో తీవ్రస్థాయిలో గొడవలు జరిగే ప్రమాదం ఉందని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇదిలావుంటే.. పరిటాల కుటుంబానికి ఒక్క టికెట్టే ఇస్తామని గతంలోనే చంద్రబాబుస్పష్టం చేశారు. అంతేకాదు.. రాప్తాడును ఇటీవల ప్రకటించారు కూడా. ఇక్కడ నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత పోటీ చేయనున్నారు. కానీ, శ్రీరాం మాత్రం తన తండ్రి నియోజకవర్గం ధర్మవరం తనకే కావాలని పట్టుబడుతున్నారు.