ఈసారి పార్లమెంటు సమావేశాలు ప్రత్యేకం.. ఎందుకంటే!
ఈసారి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఎప్పుడూ లేనివిధంగా హైఓల్టేజీ సినిమాను తలపిస్తున్న సంగతి తెలిసిందే
ఈసారి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఎప్పుడూ లేనివిధంగా హైఓల్టేజీ సినిమాను తలపిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈసారి నిర్వహిస్తున్న పార్లమెంటు సమావేశాలకు చాలా ప్రత్యేకత ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశమంతా ఈ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దేశమంతా అన్ని రాష్ట్రాలకు, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం (వన్ నేషన్ - వన్ ఎలక్షన్), ఇండియా పేరును భారత్ గా మార్చడం, ఉమ్మడి పౌరస్మృతిని ప్రవేశపెట్టడం, జమ్ముకాశ్మీర్ కు రాష్ట్ర ప్రతిపత్తి హోదా ఇలా అనేక అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెడుతుందని చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు అంశాలే ప్రధాన ఎజెండాగా ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే జమిలి ఎన్నికలపై కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ అధ్యక్షతన ఒక టాస్కుఫోర్సు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది డిసెంబర్ లో తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీసగఢ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే వచ్చే వేసవిలోగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం తదితర రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2025లో మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరపాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 11 రాష్ట్రాలకు ఒకేసారి లోక్ సభ ఎన్నికలతోపాటే ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో కేంద్రం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇందుకోసం కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను నిర్దేశిత కాలపరిమితి కంటే కుదించాల్సి ఉంటుంది. మరికొన్ని అసెంబ్లీల కాలపరిమితిని పొడిగించాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు.
అలాగే రాజ్యాంగంలో 'ఇండియా.. దట్ ఈజ్ భారత్' గా ఉన్న పేరును కేవలం 'భారత్' గా మారుస్తారని అంటున్నారు. జమిలి ఎన్నికల కోసం, దేశం పేరు మార్పు కోసం రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉందని చెబుతున్నారు. పలు సవర ణలు చేయాల్సి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెడతారని తెలుస్తోంది.
కేవలం జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పే కాకుండా కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. ప్రభుత్వం ఇంకా ఏవైనా అనూహ్య నిర్ణయాలు తీసుకోవచ్చని మీడియా కూడా భావిస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై ఆగస్టు 3వ తేదీన ప్రకటన వెలువడినప్పటి నుంచీ ఈ ఉత్కంఠ కొనసాగుతోంది.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలపై తొలుత ఎజెండా గురించి ప్రకటనలేమీ లేకపోవడంతో స్వయంగా కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీంతో గత వారం ప్రభుత్వం తాత్కాలిక ఎజెండాను ప్రకటించింది. పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై చర్చలతోపాటు నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. అయితే ప్రతిపక్షాలు కేంద్రం మాటలను విశ్వసించడం లేదు. ఏవో అనూహ్య నిర్ణయాలు ఉంటాయని భావిస్తున్నాయి.
సాధారణంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను జాతీయ ప్రాధాన్యమున్న కార్యక్రమాల సమావేశంలోనే నిర్వహిస్తారు. 2008లో కమ్యూనిస్టు పార్టీలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో బల నిరూపణ కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని కేవలం ఒక్క రోజు ఏర్పాటు చేశారు.
అలాగే 2017లో జీఎస్టీ బిల్లుకు ఆమోదం కోసం మోదీ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా రెండుసార్లు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలనను పొడిగించడానికి ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేశారు.
రాజ్యాంగం ప్రకారం రెండు పార్లమెంటు సమావేశాల మధ్య 6 నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉండకూడదు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగం అధికారమిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ప్రత్యేక సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటుంది. అయితే 'ప్రత్యేక సెషన్' అని రాజ్యాంగంలో లేదని తెలుస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85(1) నిబంధనల ప్రకారం.. ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయొచ్చని చెబుతున్నారు.
కాగా ఇప్పటిదాకా 7 సార్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు.
1977: తమిళనాడు, నాగాలాండ్ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన కోసం
1991: హరియాణాలో రాష్ట్రపతి పాలన విధించేందుకు
1992: క్విట్ ఇండియా ఉద్యమ 50వ దినోత్సవం కోసం ఆగస్టు తొమ్మిదో తేదీ ప్రత్యేక సమావేశం
1997: భారత స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల కోసం ఆగస్టు 26 నుంచి సెప్టెంబరు 1 వరకూ సమావేశాలు
2008: కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో విశ్వాస పరీక్ష కోసం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
2015: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి వేడుకల కోసం సభ ప్రత్యేకంగా సమావేశమైంది.
2017: జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం