`ఎస్సీ` రిజ‌ర్వేష‌న్‌.. క‌థ మొద‌టికేనా?

నిరంత‌ర ఉద్య‌మాల‌కు పిలుపునిచ్చారు. వీరిలో మాల ఉద్యోగ సంఘాలు ఉండ‌డం ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది.

Update: 2024-09-16 03:46 GMT

ఎస్సీ రిజ‌ర్వేష‌న్‌ను వ‌ర్గీక‌రించాలంటూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ద‌రిమిలా.. ఏడాదిలోగా ఈ ప్ర‌క్రియ పూర్తి చేయాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై ప‌డింది. దీంతో ఆదిశ‌గా తెలుగు రాష్ట్రాలు త‌మ త‌మ పంథాల్లో ప్ర‌క్రియ ను ప్రారంభించాయి. అయితే.. ఆదిలోనే హంస పాదు అన్న‌ట్టుగా ఏపీలో ఈ ప్ర‌క్రియ ప్రారంభం అవుతున్న నేప థ్యంలో మాల‌లు విజృంభించారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా క‌దం తొక్కుతున్నారు.

నిరంత‌ర ఉద్య‌మాల‌కు పిలుపునిచ్చారు. వీరిలో మాల ఉద్యోగ సంఘాలు ఉండ‌డం ప్ర‌భుత్వానికి ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అన్ని రాజ‌కీయ పార్టీలూ అనుకూల‌మే. అయితే.. వ‌ర్గీక‌ర‌ణ‌కు మాల‌లు, రెల్లి కుల‌స్తులు వ్య‌తిరేకంగా ఉన్నారు. వ‌ర్గీక‌ర‌ణ జ‌రిగితే.. తాము న‌ష్ట‌పోతామ‌ని వారు చెబుతున్నారు. త‌ద్వారా ఉద్యోగాలు, ఉద్యోగాల్లో ప్ర‌మోష‌న్లు వంటివి కూడా.. త‌మ‌కు దూర‌మ‌వుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే శ‌నివారం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మాల‌కు శ్రీకారం చుట్టారు. దీనిలో ప‌లు మాల ఉద్యోగ సంఘాలు చేతులు క‌లిపాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ర్గీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా తీర్మానం చేయాల‌న్న‌ది వారి డిమాండ్‌గా ఉంది. జైభీం అంబేడ్క‌ర్ పార్టీ అధ్య‌క్షుడు, న్యాయవాది జ‌డ శ్రావ‌ణ కుమార్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాల‌కు పిలుపునిచ్చారు. అయితే.. ఈ విష‌యంలో ఇప్ప‌టికే మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ..సీఎం చంద్ర‌బాబును క‌లుసుకున్నారు.

సాధ్య‌మైనంత వేగంగా వ‌ర్గీక‌ర‌ణ చేప‌ట్టాల‌ని మంద కృష్ణ కోరారు. దీనికి చంద్ర‌బాబు ఓకే చెప్పారు. ఈ నెల 20 నుంచి జిల్లాల స్థాయిలో వ‌ర్గీక‌ర‌ణ ప్ర‌క్రియ‌కు సంబంధించిన కార్య‌క్ర‌మాలు కూడాప్రారంభం అవుతున్నాయి. ఇంత‌లోనే మాల‌లు ఉద్య‌మించ‌డం ఆశ్చ‌ర్యంగాను.. ఆందోళ‌న‌గానూ త‌యారైంది. చివ‌ర‌కు దీనిపై ఎలాం టి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. మ‌రోవైపు.. సుప్రీంకోర్టు ఏడాదిలోగా కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేయాల‌ని నిర్దేశించిన విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News