విమానంలో బీడీ... ఇదేం పాడు అలవాటు సామీ
ఎంత ఎయిర్ ప్లేన్ ఎక్కినా కూడా బీడీ కాల్చిన ఓ పెద్దమనిషి తీరు ఇప్పుడు ఇలాగే ఏడ్చింది.;

కనకపు సింహాసనం మీద శునకం కూర్చుండబెట్టి వెనుకటి గుణమేలు మాను వినరా సుమతీ అంటారు. ఎంత ఎయిర్ ప్లేన్ ఎక్కినా కూడా బీడీ కాల్చిన ఓ పెద్దమనిషి తీరు ఇప్పుడు ఇలాగే ఏడ్చింది. అవును.. అసలు విమానంలో సిగరెట్లు, బీడీలు కాల్చడమే నిషేధం.. అందులో ఏకంగా బీడీ తాగిన ఓ ప్రభుద్దిడిని పట్టుకొని పోలీసులకు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఎక్కడో కాదు.. మన భారత్ లోనే జరగడం విశేషం. బీడీ తాగి పట్టుబడిన ప్రయాణికుడికి తగినశాస్తి జరిగింది.
సూరత్ నుంచి కోల్‌కతా వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడు బీడీ తాగుతూ విమాన సిబ్బందికి పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. సూరత్ నుంచి కోల్‌కతాకు బయలుదేరాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో టేకాఫ్ ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు విమానంలోనే వేచి ఉన్నారు. ఈ సమయంలో విమానంలోని వాష్‌రూమ్‌లో నుంచి పొగ వాసన రావడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే వారు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు.
అధికారులు తనిఖీలు నిర్వహించగా, పశ్చిమబెంగాల్‌కు చెందిన అశోక్ బిశ్వాస్ అనే ప్రయాణికుడి బ్యాగ్‌లో బీడీలు.. అగ్గిపెట్టె ఉన్నట్లు గుర్తించారు. అతడు వాష్‌రూమ్‌లో బీడీ తాగినట్లు నిర్ధారించుకున్న అనంతరం అధికారులు అతడిని విమానం నుంచి దించేశారు. అనంతరం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
భద్రతా తనిఖీల సమయంలో నిషేధిత వస్తువులను ప్రయాణికుడు విమానంలోకి ఎలా తీసుకువచ్చాడనే విషయంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇతర ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే అగ్గిపెట్టె వంటి వస్తువులను తీసుకువచ్చినందుకు అశోక్ బిశ్వాస్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు వారు పేర్కొన్నారు.