మహేందర్ రెడ్డికి మంత్రి పదవి.. అసలు కారణం ఇదేనా?
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మరోసారి గెలిచి అధికారంలోకి రావాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మరోసారి గెలిచి అధికారంలోకి రావాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే అన్ని పార్టీలకంటే ముందుగా బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేశారు. ఈ క్రమంలో గతంలో కాంగ్రెస్ తరఫున గెలిచి ఆ తర్వాత బీఆర్‌ఎస్ లోకి గోడ దూకిన నేతలకు కూడా సీట్లు కేటాయించారు. దీంతో బీఆర్‌ఎస్ లో మొదటి నుంచి ఉన్న నేతలకు చుక్కెదురు అయ్యింది.
ఇదే కోవలో తాండూరు మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి అక్కడ సీటు ఇవ్వలేదు. 2018 ఎన్నికల్లో తాండూరులో కాంగ్రెస్ నుంచి గెలిచి ఆ తర్వాత బీఆర్‌ఎస్ లోకి ఫిరాయించిన పైలట్ రోహిత్ రెడ్డికే కేసీఆర్ సీటు ఇచ్చారు. దీంతో పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి.
అయితే పట్నం మహేందర్ రెడ్డిని వదులుకుంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతోపాటు మహబూబ్ నగర్ జిల్లా లోనూ బీఆర్‌ఎస్ కు గట్టి దెబ్బ పడే ప్రమాదం ఉండటంతోనే ఆయనను వదులుకోవడానికి కేసీఆర్ ఇష్టపడలేదని అంటున్నారు. పట్నం మహేందర్ రెడ్డి.. దివంగత మాజీ మంత్రి ఇంద్రారెడ్డి మేనల్లుడు. గతంలో ఇంద్రారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోం శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన మృతితో ఆయన సతీమణి సబిత రాజకీయాల్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున పలుమార్లు చేవేళ్ల, మహేశ్వరం నియోజకవర్గాల్లో గెలుపొంది మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేసీఆర్ మంత్రివర్గంలోనూ మంత్రిగానూ ఉన్నారు. అంటే సబితా ఇంద్రారెడ్డి.. పట్నం మహేందర్ రెడ్డికి మేనత్త అవుతారు.
మరోవైపు పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని నరేందర్ రెడ్డి ఓడించారు. మరోవైపు మహేందర్ రెడ్డి సతీమణి సునీత వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్నారు. గతంలోనూ ఆమె ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పనిచేశారు. అలాగే మహేందర్ రెడ్డి సోదరుడి కుమారుడు అవినాశ్ రెడ్డి జెడ్పీటీసీగా ఉన్నారు. ఇలా పట్నం రాజకీయ చరిత్ర చాలా పెద్దదే.
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలను ప్రభావితం చేయగలిగిన పట్నం మహేందర్ రెడ్డిని దూరం చేసుకుంటే బీఆర్‌ఎస్ కు గట్టి దెబ్బ తప్పదని భయపడే కేసీఆర్ ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారని అంటున్నారు. ఈటెల రాజేందర్ ను పదవి నుంచి తప్పించి ఏడాదిన్నర అవుతోంది. ఇన్నాళ్ల కాలంలో ఈటెల ఖాళీ చేసిన స్థానంలో మరో మంత్రిని నియమించని కేసీఆర్.. ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలలు కూడా లేనప్పుడు మహేందర్ రెడ్డిని మంత్రిగా నియమించడం విశేషం.
మహేందర్ రెడ్డి బలమైన రెడ్డి సామాజికవర్గ నేత కావడం.. ఆయన పార్టీ మారితే మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, కేఎస్ రత్నం వంటివారు కూడా పార్టీ మారే ప్రమాదం ఉండటంతోనే కేసీఆర్.. పట్నం మహేందర్ రెడ్డికి మంత్రిగా చాన్సు ఇచ్చారని టాక్ నడుస్తోంది.
పట్నం ప్రాధాన్యతను గుర్తించే 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా వెంటనే ఎమ్మెల్సీగా చాన్సు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. 2014లో కేసీఆర్ మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు పట్నం మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవడం గమనార్హం. ఇప్పుడు కూడా ఇలా రాజకీయ లెక్కలతోనే ఆయనకు మంత్రి పదవి దక్కిందని చెబుతున్నారు.
మహేందర్‌రెడ్డి విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించినా.. ప్రత్యర్థులు మరింత అగ్గిరాజేసి ఎన్నికల్లో లబ్ధిపొందే అవకాశం ఉండేదని కేసీఆర్ భావించినట్టు టాక్. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలకు ఆ అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించిన కేసీఆర్.. వారి ఎత్తులకు పైఎత్తు వేసి మహేందర్ రెడ్డికి మంత్రి పదవి అప్పగించారని సమాచారం.