తనను కొట్టిన ఎస్పీకి బొకే ఇచ్చిన పట్టాభి

ఆయన ఇంటిపై దాడి చేసి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు.

Update: 2024-06-06 07:57 GMT

టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను గత ఐదేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం నానా రకాల ఇబ్బందులకు గురి చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తున్నారన్న కారణంతో పట్టాభిని వైసీపీ నేతలు టార్గెట్ చేశారు. ఆయన ఇంటిపై దాడి చేసి వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. అంతేకాకుండా పట్టాభిని అరెస్టు చేసి ఆయనపై థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం ఘోర పరాజయంపాలైన నేపథ్యంలో తనపై డిగ్రీ ప్రయోగించిన ఎస్పి స్థాయి అధికారిని కలిసేందుకు పట్టాభి ప్రయత్నించిన వైనం ఆసక్తికరంగా మారింది.

ఆ ఎస్పీ నివాసానికి పట్టాభి వెళ్లి ఆయనను కలిసేందుకు ప్రయత్నించడం హాట్ టాపిక్ గా మారింది. తనను ఆనాడు అక్రమంగా నిర్బంధించి రాచమర్యాదలు చేసిన ఆనాటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా గారిని కలిసేందుకు వెళ్లాననిప పట్టాభి అన్నారు. ఓ అక్రమ కేసులో తనను ఆయన 2023 ఫిబ్రవరి 20వ తేదీన అరెస్టు చేసి చిత్రహింసలకు గురి చేశారని పట్టాభి గుర్తు చేసుకున్నారు. ఆనాడు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన జాషువాని కలిసి బొకే, శాలువాతో సత్కరించేందుకు ఆయన నివాసానికి వెళ్లానని, అయితే ఆయన అక్కడ లేరని పట్టాభి చెప్పారు.

విజయవాడ సమీపంలోని ఏడున్నర ఎకరాల సువిశాలమైన విలాసవంతమైన అతిథి గృహంలో ఆయన ఉంటున్నారని తనకు తెలిసి అక్కడికి వెళ్లానని, కానీ, ఆయన అక్కడ లేకపోవడంతో కుర్చీలో బొకే, శాలువా ఉంచి వీడియో సందేశాన్ని ఆ ఎస్పీకి పంపించానని పట్టాభి వెల్లడించారు. గత ప్రభుత్వం చెప్పు చేతల్లో నడుచుకొని టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించిన పోలీసులు ఇప్పుడు సెలవుపై వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ నేతలను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేసన పోలీసులు, అధికారులు చాలామంది సెలవుపై లేదంటే విదేశాలకు లేకపోతే అండర్ గ్రౌండ్ కు వెళ్తున్నారని తెలుస్తోంది.

Tags:    

Similar News