బాబు ఈజ్ గ్రేట్... ఎక్కడ తగ్గాలో పవన్ కే తెలుసు !

బాబూ ఈజ్ గ్రేట్. ఇటీవల కాలంలో అనేక సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు.

Update: 2024-09-06 04:16 GMT

బాబూ ఈజ్ గ్రేట్. ఇటీవల కాలంలో అనేక సార్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఆయన చంద్రబాబు పనితీరుని ఆయన విజన్ ని ఆయన కష్టాన్ని ఆయన ఆలోచనలను ఇలా చాలా విషయాల్లో మెచ్చేసుకుంటున్నారు. నిజానికి కూటమిలో ఉన్న పార్టీలు ఇంతలా తోటి పక్షం అధినేత గురించి మాట్లాడటం అంటే చాలా ఆలోచిస్తాయి.

ఎన్నికల ముందు కట్టిన కూటములు అధికారంలోకి వచ్చాక పొరపొచ్చాలుగా మారి ఇబ్బంది పడిన సందర్భాలే ఎక్కువ. ఏపీలో చూస్తే చంద్రబాబు విశేష అనుభవశాలి గా ఉన్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ రీల్ హీరోగా పవర్ స్టార్. పొలిటికల్ గా కూడా ఒక సంచలనంగా ఉన్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎలా అన్నది రాజకీయ విశ్లేషకులకు కూడా ఆశ్చర్యంతో కూడిన సందేహాలను అనేకం కల్పించింది.

అయితే కూటమి ప్రభుత్వంలో పవన్ చేరడమే కాదు బాబుకు డిప్యూటీగా పనిచేసేందుకు సిద్ధం అయ్యారు. అలా ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తనకు తెలుసు అని తొలి అడుగులలోనే చెప్పేశారు. అలాగే తన మంత్రిత్వ శాఖలను చూసుకుని తన పరిధిలూ పరిమితులూ కూడా చూసుకుంటూ పవన్ చాలా బాలెన్స్ గానే వ్యవహరిస్తున్నారు

ఈ నేపథ్యంలో బాబుని పవన్ పదే పదే పొగుడుతున్నారు. ఇది అంత అవసరమా అన్న చర్చ కూడా ఒక వైపు ఉంది. కూటమిలో బీజేపీ కూడా మిత్ర పక్షమే. కానీ ఆ పార్టీ నాయకులు బాబు ఈజ్ గ్రేట్ అని పెద్దగా అనడం లేదు. ఒకటి రెండు సందర్భాలలో కూటమి ప్రభుత్వాన్ని బాబు బాగా నడుపుతున్నారు. అది కూడా కేంద్రం సహకారంతో అని వారు అంటూ వచ్చారు

అయితే పవన్ మాత్రం చాలా బోల్డ్ గా ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మరి ఆయన బాబుని గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని ఎప్పటి నుంచో చెబుతున్నారు. దాని ప్రకారమే ఆయన మాట్లాడుతున్నారు. బాబుని డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా పవన్ పొగడడం, ఆయన వద్ద నేర్చుకోవాల్సిది చాలా ఉంది అని అనడం ఇవన్నీ పవన్ లో రాజకీయ పరిపక్వతను తెలియచేస్తున్నాయి.

అయితే అదే సమయంలో కూటమిలో బాబు ఈజ్ గ్రేట్ అంటే పవన్ ఎప్పటికీ డిప్యూటీ సీఎం గానే మిగిలిపోతారా అన్న చర్చ కూడా జనసైనికులలో ఆయన అభిమానులలో నడుస్తోంది. ఇటీవల జరిగిన పవన్ బర్త్ డే వేడుకల్లో అయితే జనసైనికులు పవన్ సీఎం 2029లో అని ఒక టార్గెట్ ని కూడా పెట్టేశారు.

పవన్ సీఎం కావాలన్నదే వారి కోరిక. ఈ పవర్ సరిపోదు పవర్ స్టారూ అని కూడా జనసైనికులు అంటున్నారు. అంటే వారికి కావాల్సింది తమ నాయకుడు సీఎం కావడం. ఇక ఒక బలమైన సామాజిక వర్గంలోనూ పవన్ ని సీఎం గా చూడాలని ఆశ ఉంది. అయితే అది ఈ టెర్మ్ లో నెరవేరదు అని జనసైనికులు పవన్ అభిమానులు అయితే ఒక ఆలోచనకు వచ్చారు అని అర్ధం అవుతోంది. అందుకే వారు 2029 అని అంటున్నారు.

కానీ బాబూ ఈజ్ గ్రేట్ అని పవన్ అంటున్న తీరుని చూస్తే కనుక 2029లోనూ అది నెరవేరుతుందా అన్న చర్చ సాగుతోంది. టీడీపీ అయితే జనసేన మిత్ర బంధం వదులుకోదు అని అంటున్నారు. అలాగే జనసేన కూడా టీడీపీతోనే ముందుకు సాగుతుంది. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్తే జనసేన జూనియర్ పార్టనర్ గానే ఉంటుంది. ఒకవేళ 2029 ఎన్నికల నాటికి చంద్రబాబు సీఎం కాకపోయినా లోకేష్ సీఎం క్యాండిడేట్ గా కచ్చితంగా ఎక్స్ పోజ్ అవుతారు అని అంటున్నారు.

ఎందుకంటే కూటమిలో అప్పటికి కూడా పెద్ద పార్టీగా టీడీపీయే ఉంటుంది అని అంటున్నారు. మరి ఇవన్నీ ఇలా ఉంటే బాబు ని పొగడడంలో పవన్ ఆంతర్యం ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది. అయితే పవన్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. బాబు విజనరీని ఆయన మెచ్చుకుంటున్నారు అని అంటున్నారు. అదే సమయంలో ఆయనకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసు అని అంటున్న వారూ ఉన్నారు.

ఏది ఏమైనా బాబుని మరీ ఎక్కువగా పవన్ పొగుడుతున్నారా అని అన్న వారికి అలా అనిపించిన వారికీ పవన్ ఆలోచనలు ఏమిటో అర్ధం కావు కానీ పవన్ మాత్రం కూటమిలో ఉప నేతగా తన విధులను బాధ్యతలను నూరు శాతం నెరవేర్చే క్రమంలోనే అంతా చేస్తున్నారు అని అంటున్నారు. సో ఇప్పటికి అయితే బాబూ ఈజ్ గ్రేట్ అంతే.

Tags:    

Similar News