బాబుతో పవన్...అన్నింటికీ ఒక్కటే జవాబు
ఇంకేముంది టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
ఏపీలో కూటమి ప్రభుత్వంలో విభేదాలు ఉన్నాయని అందులోని పార్టీల మధ్య తెలియని అంతరం ఉందని అనేక రకాలైన పుకారులు ఇటీవల కాలంలో షికారు చేశాయి. వాటికి బలం చేకూర్చేలా వరసగా ఈ నెల 6న జరిగిన మంత్రివర్గ సమావేశానికి అలాగే మంత్రులు కార్యదర్శులతో జరిగిన ఉన్నత స్థాయి మీటింగ్ కి పవన్ గైర్ హాజరు అయ్యారు. ఇంకేముంది టీడీపీ జనసేన పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
దానికి తగినట్లుగా చంద్రబాబు ఫోన్ చేసినా పవన్ రిసీఫ్ చేసుకోలేదని మరో ప్రచారం సాగింది. ఇంకేముంది పవన్ కూటమి నుంచి బయటకు వస్తారని ఆయన సొంత రాజకీయం మొదలెడతారని దీని వెనక కూడా కొందరు సూత్రధారులు ఉన్నారని కూడా ప్రచారం చేశారు. సోషల్ మీడియాలో అయితే ఇటీవల కాలంలో దీని మీదనే తెగ వైరల్ చేశారు.
అయితే అవన్నీ తప్పు అని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రుజువు చేశారు. ఆయన నాలుగు రోజుల పాటు దక్షిణ భారత దేశ యాత్రలను చేపట్టారు. తాను ఎన్నో ఏళ్ళ క్రితం మొక్కుకున్నాను అని వాటిని ఇపుడు తీర్చుకుంటున్నాను అని ఆయన ఈ సందర్భంగా మీడియాకు చెప్పారు.
ఇక బుధవారం నుంచి మొదలెట్టిన పవన్ ఆధ్యాత్మిక యాత్ర శనివారంతో ముగియడంతో ఆయన అటు నుంచి అటే విజయవాడకు వచ్చారు. ఆయన డైరెక్ట్ గా విజయవాడలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించే ప్రాంగణానికే చేరుకున్నారు. తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో యుఫోరియా పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబుకు పవన్ కి చాలా రోజుల క్రితమే ముఖ్య అతిధులుగా హాజరు కావాలని ఆహ్వానం అందింది.
ఇదిలా ఉండగా పవన్ ఈ కార్యక్రమానికి వస్తారా అన్న చర్చ కూడా సాగింది. అయితే పవన్ తన ఆధ్యాత్మిక యాత్రలో వేసుకున్న సాంప్రదాయ వస్త్రాలతోనే నేరుగా ఈ కార్యక్రమానికి రావడం విశేషం. ఆయన ఈ రకంగా హాజరు కావడం ఎంతటి నిబద్ధతతో ఉన్నారో తెలియచేసేందుకు ఒక ఉదాహరణ అని అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సతీమణి నారా భువనేశ్వరి మంత్రి లోకేష్ సాదరంగా రిసీవ్ చేసుకున్నారు. అనంతరం బాబుతో కలసి పవన్ ఈ కార్యక్రమానికి తిలకించడం విశేషం. ఇదిలా ఉంటే గత నెల 26న జరిగిన విజయవాడలోని రాజ్ ఎట్ హోం పేరుతో గవర్నర్ ఇచ్చిన తేనీటి విందుకు బాబు పవన్ కలసి హాజరయ్యారు. అది జరిగిన తరువాత మళ్ళీ బహిరంగంగా ఇన్నాళ్ళకు ఇద్దరూ పక్క పక్కన కలసి కూర్చోవడం ఇదే కావడంతో అంతా ఆసక్తిని ప్రదర్శించారు.
మరో వైపు చూస్తే కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని పవన్ ఈ విధంగా చాటి చెప్పినట్లు అయింది. ఆయన తన రాకతో అన్ని ప్రశ్నలకూ ఒకే జవాబు ఇచ్చారని అంటున్నారు. పవన్ విషయంలో ఎవరైనా ఈ విధంగా ఆలోచిస్తే వారు పప్పులో కాలు వేస్తారు అనడానికి ఆయన తాజా హాజరే ఒక నిదర్శనం అని అంటున్నారు. పవన్ ని ఎవరూ రొటీన్ రెగ్యులర్ పొలిటీషియన్ గా చూసి విశ్లేషించకూడదని అంటారు. ఆయన చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తారు అన్నది పదేళ్ళ జనసేన ప్రస్థానం లో రుజువు అయింది అని గుర్తు చేసేవారూ ఉన్నారు.
రాష్ట్రం పట్ల దేశం పట్ల నిండైన అభిమానం ఉన్న పవన్ రాజకీయాల కంటే అతీతంగా ఆలోచిస్తారు అని అంటారు. అంతే కాదు ఆయన విషయంలో ఎపుడు ఈ తరహా వార్తలు రాసినా అవి తప్పే అవుతాయని అంటున్నారు. మొత్తానికి ఒక అందమైన సాయంత్రం వీకెండ్ లో ఆహ్లాదకరమైన వాతావరణంలో సంగీత భరితమైన ఒక కార్యక్రమంలో కూటమి పెద్దలుగా చంద్రబాబు పవన్ హాజరు కావడం, కలసి కూర్చుని ఆస్వాదించడం మాత్రం అందరినీ ఆనందభరితులను చేసింది అని అంటున్నారు. ఈ దెబ్బతో కూటమిలో విభేదాలు అన్న వార్తలు టీ కప్పులో తుఫాను మాదిరిగా కొట్టుకుని పోయాయని అంటున్నారు.