ఇందుకే.. పవన్‌ ప్రత్యేకం!

ఆంధ్రప్రదేశ్‌ లో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని పథకాలకు వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ పేర్లే పెట్టిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-11 07:52 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అన్ని పథకాలకు వైఎస్సార్, వైఎస్‌ జగన్‌ పేర్లే పెట్టిన సంగతి తెలిసిందే. జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా వసతి, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, జగనన్న ఆణిముత్యాలు, వైఎస్సార్‌ మత్స్యకార భరోసా, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ అభయహస్తం, జగనన్న కాలనీలు, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్‌ నేతన్న నేస్తం ఇలా ఎన్నో పథకాలకు వారి పేర్లు పెట్టుకున్నారు. చివరకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరుతో ఉన్న విదేశీ విద్యా దీవెనకు సైతం ఆయన పేరును తీసేసి జగనన్న విదేశీ విద్యా దీవెన అని పేరు మార్చారు. దీనిపైన విమర్శలు వ్యక్తమయినా నాటి సీఎం వైఎస్‌ జగన్‌ లెక్కచేయలేదు.

అయితే ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడా పథకాలకు తమ పేర్లను తగిలించుకోలేదు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ ఈ పేర్ల విషయంలో అందరికీ ఆదర్శంగా ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టారు.

తాజాగా వరద బాధితులను పరామర్శించడానికి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన పవన్‌ కళ్యాణ్‌ కు స్థానికుల నుంచి ఒక విన్నపం వచ్చింది. స్థానికంగా ఉన్న జగనన్న కాలనీకి ఆ పేరు తొలగించి మీకు నచ్చిన పేరు పెట్టాలని కోరగా.. ఇందుకు ఆయన తిరస్కరించారు.

ఎంతోమంది దేశ నాయకులు, జాతీయ నాయకులు, ప్రజలకు మంచి చేసినవారు ఉన్నారని.. పథకాలకు, తదితరాలకు వారి పేర్లే ఉండాలని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. జగన్‌ లాంటి వ్యక్తుల పేర్లు అస్సలే ఉండకూడదన్నారు.

పిఠాపురం ప్రజలు, జనసేన నేతలు, శ్రేణులు జగనన్న కాలనీకి పేరు పెట్టాలని పవన్‌ ను కోరినా వారి మాయలో పవన్‌ పడలేదు. వారి మాటలకు ప్రభావితం కాలేదు. మరోసారి పవన్‌ తన పరిణతి చెందిన, ఆలోచనాత్మక సమాధానంతో తాను ఎందుకు ఇతరులకు ప్రత్యేకమో చాటిచెప్పారు.

‘‘ఈ నేల, ఈ రాష్ట్రం, మన దేశం కోసం పోరాడిన వారు చాలా మంది ఉన్నారు. ఏదైనా ఉంటే.. మన స్వేచ్ఛ కోసం పోరాడిన విప్లవ నాయకుల పేర్లను మన పథకాలు, ప్రాజెక్టులకు పెట్టాలి. ప్రాజెక్టులకు రాజకీయ నాయకుల పేర్లు పెట్టడం సరికాదు, ముఖ్యంగా జగన్‌ లాంటి వారి పేర్లు పెట్టడం సరికాదు’’ అని పవన్‌ తెలిపారు. ఈ క్రమంలో జగనన్న కాలనీలకు కూడా జాతీయ నాయకుల పేర్లే ఉండాలని పవన్‌ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు వచ్చిన రాజకీయ నాయకుల్లో చాలామంది ఆయా పథకాలకు, ప్రాజెక్టులకు తమ పేర్లు, తమ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకున్నారు. అయితే వారికి విరుద్ధంగా దేశ నాయకుల పేర్లే పథకాలకు, ప్రాజెక్టులకు ఉండాలని చెప్పడంపై పవన్‌ కళ్యాణ్‌ పై ప్రశంసలు కురుస్తున్నాయి.

Tags:    

Similar News