ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై ప‌వ‌న్ ప్లాన్‌.. ఇదే.. !

రాష్ట్రంలో జ‌రుగుతున్న మూడు శాస‌న మండ‌లి ఎన్నిక‌లపై కూట‌మి పార్టీలు బాగానే ఆశ‌లు పెట్టుకున్నాయి.

Update: 2025-02-17 00:30 GMT

రాష్ట్రంలో జ‌రుగుతున్న మూడు శాస‌న మండ‌లి ఎన్నిక‌లపై కూట‌మి పార్టీలు బాగానే ఆశ‌లు పెట్టుకున్నాయి. కూట‌మి మిత్ర‌ప‌క్షం బీజేపీ ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. టీడీపీ బ‌ల‌మైన నిర్న‌యం తీసుకుంది. ఈ ఎన్నిక‌ల‌ను అప్ర‌క‌టిత రెఫ‌రెండంగానే భావించాల్సి ఉంటుంద‌ని సీఎం చంద్ర‌బాబు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను టీడీపీ ప్ర‌తిష్టాత్మ‌కంగానే భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీ నాయ‌కుల‌కు సీఎం చంద్ర‌బాబు తర‌చుగా క్లాస్ తీసుకుంటున్నారు.

ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంలో అంటీముట్ట‌న‌ట్టు ఉన్న జ‌న‌సేన నాయ‌కులు కూడా క‌ద‌ల‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీనికి కార‌ణం.. పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. శాస‌న మండ‌లి ఎన్నిక‌లు జ‌రుగుతున్న జిల్లాల్లో ఇంచార్జ్‌ల‌ను నియ‌మించారు. ఎన్నిక‌ల‌ను స‌మన్వ‌యం చేసుకోవ‌డం తోపాటు.. కూట‌మి అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్రచారం కూడా చేయాల‌ని ఆయ‌న నిర్దేశించారు. మొత్తంగా ఈ ఎమ్మెల్సీ స్థానాల ప‌రిధిలో 8 పార్ల‌మెంటు స్థానాలు ఉన్నాయి.

ఈ ఎనిమిది పార్ల‌మెంటు స్థానాల‌కు కూడా.. జ‌న‌సేన త‌ర‌ఫున ఎనిమిది మందిని నియ‌మించారు. వీరు.. ఇక్క‌డ పోటీలో ఉన్న టీడీపీ నేత‌ల‌తో క‌లిసి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కువెళ్లాలి. అదేవిధంగా అవ‌స‌ర‌మైతే.. వ్య‌క్తిగ తంగా కూడా ప్ర‌చారం చేయాల్సి ఉంటుంది. కూట‌మి చేప‌ట్టిన కార్య‌క్ర‌మాలు, అభివృద్దిని అజెండాగా చేసుకుని ప్ర‌జ‌ల‌కు వివ‌రించాల‌ని జ‌న‌సేన అధినేత నిర్దేశించారు. అంతేకాదు.. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసే వ‌ర‌కు కూడా.. నాయ‌కులు అందుబాటులో ఉండాల‌ని సూచించారు.

ముఖ్యంగా పార్ల‌మెంటు స‌భ్యులు ఈ బాధ్య‌త‌లు తీసుకోవాల‌ని ప‌వ‌న్ ఆదేశించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ వ్య‌వ‌హారాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ఎంత సీరియ‌స్‌గా తీసుకున్నార‌నేది ఈ విష‌యాన్ని బ‌ట్టి తెలుస్తోంది. కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. వ‌చ్చిన తొలి ఎన్నిక‌లు ఇవేకావ‌డం.. బ‌రిలో బ‌ల‌మైన అభ్య‌ర్థులు ఉండ‌డం.. వంటివి ప్రాధాన్యం పెంచుతున్నాయి. ఇదేస‌మ‌యంలో కూట‌మి ఎంత బ‌లంగా ఉన్న‌ద‌నే విష‌యం కూడా.. ఈఎన్నిక‌ల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతుంద‌న్న సంకేతాలు కూడా వ‌స్తాయి. అందుకే... ప‌వ‌న్ ఈ ఎన్నిక‌ల‌ను ప్రాధ‌న్యంగా భావిస్తున్నార‌ని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News