పవన్ సార్... ఏమైంది సార్ !
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఏమైంది అన్నది ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది.;

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఏమైంది అన్నది ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. వెండి తెర మీద ఆయన పవర్ స్టార్. ఆయనకు ఉన్న అభిమాన జనానికి ఎల్లలు లేవు. ఇక ఆయన రాజకీయాల్లో కూడా సక్సెస్ ఫుల్ స్టార్ గా ఇపుడు ఉన్నారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉన్న వారుగా సైతం కనిపిస్తున్నారు.
అటువంటి పవన్ కళ్యాణ్ కి ఏమైంది. ఆయన ఆరోగ్యం విషయం లో తరచుగా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయన్నది చర్చగా ఉంది. నిన్నటికి నిన్న ఏపీ కేబినెట్ మీటింగ్ కోసం పవన్ హైదరాబాద్ నుంచి వచ్చారు. నిజానికి ఉదయం పదకొండు గంటలకు ఈ మీటింగ్ స్టార్ట్ కావాల్సి ఉండగా పవన్ ఉదయం పదిన్నరకే చేరుకున్నారు. అయితే ఆ సమయానికి ఆయనకు జ్వరం ఉంది.
అయినా మీటింగు ఉంది కదా అని వచ్చారు. అయితే ఆయన సచివాలయానికి చేరుకునేసరికి ఆ జ్వరం కాస్తా అధికం అయింది అని అంటున్నారు. దాంతో ఆయన తన క్యాంప్ ఆఫీసుకు తిరిగి వెళ్ళిపోవడానికి లిఫ్ట్ వద్దకు వెళ్ళారు. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ అవడం కోసం కూడా ఆయన వెయిట్ చేయలేక అక్కడే కుర్చీలో కొంతసేపు కూర్చుండిపోయారు అని చెబుతున్నారు.
దీంతో పవన్ కి ఏమైంది అన్న చర్చ అందరిలోనూ కలుగుతోంది. నిజానికి పవన్ వయోభారం తో ఉన్న వారు ఏమీ కాదు. ఆయన మిడిల్ ఏజ్ లో ఉన్నారు. ఆయన ఈ వయసులో చాలా స్టామినాతో ఉండాల్సిన వారు కానీ తరచూ ఆయన అనారోగ్యం పాలు అవుతున్నారు.
ఇంతకీ పవన్ కి ఉన్న ఆరోగ్య సమస్యలు ఏమిటి అన్నది మరోసారి ఏపీలో చర్చగా మారింది. పవన్ అభిమానులకు జనసైనికులకు అయితే ఇది మరీ కలవరం రేకెత్తించేలా ఉంది. పవన్ కి తరచూ జ్వరం వస్తోంది అని అంటున్నారు. ఇక ఆయనకు స్పాండిలైటిస్ సమస్య కూడా ఉంది అని అంటున్నారు.
ఆయన చాలా కాలంగా ఆ సమస్యతో సతమతమవుతున్నారు. ఆయన రాజకీయాల్లోకి రాక ముందు అంటే సినిమాల్లో ఉన్నప్పటి నుంచే ఈ సమస్య ఉందని చెబుతున్నారు. ఇక ఆయన ప్రతిపక్ష నేతగా పర్యటించినపుడు కూడా ఒక్కోసారి చెప్పలేని బాధతో అకస్మాత్తుగా మీటింగ్ మధ్యలో నుంచి వెళ్ళి విశ్రాంతి తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
ఇపుడు చూస్తే సరిగ్గా కేబినెట్ మీటింగ్ కి ముందు పవన్ జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్యతో సతమతమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పవన్ తన ఆరోగ్యాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఆయన జనంలో ఉండాల్సిన వారు. అలాగే సినిమాల్లో కూడా ఆయన హీరోగా వీరోచిత పోరాటాలు చేయాల్సిన కధా నాయకుడు. ఆయన ఉన్న రెండు రంగాలలో టఫ్ జాబ్ ఉంటుంది.
అయితే పవన్ తన హెల్త్ విషయంలో మరింత ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉందని శ్రేయోభిలాషులు అంతా కోరుతున్నారు. పవన్ ఇపుడు చాలా కీలకమైన బాధ్యతలతో ఉన్నారు. ఒక వైపు ఆయన సినిమాలు చేయాలి. ఆయనే చెప్పినట్లుగా సినిమాలే ఆదాయ మార్గాలు. కాబట్టి సినిమాలు చేయాలి. అలాగే రాజకీయంగా ఆయన ఇపుడు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్లేస్ లో ఉన్నారు. సో రాజకీయాల్లో చురుగ్గా ఉండాలి. పార్టీకి ఆయనే సర్వస్వంగా ఉన్నారు. అలా చూసుకున్నా ఆయన పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళి పటిష్టం చేయాలి.
దాంతో పవన్ కి ఈ అనారోగ్య సమస్యలు పట్టి పీడించడం పట్ల అంతా ఆందోళన చెందుతున్నారు. ఇక ఆయనకు ఉన్నది స్పాండిలైటిస్ సమస్య అయితే దానికి బెస్ట్ మెడిసిన్ విదేశాల్లో ఉంది అని అంటున్నారు. ఆయన కొన్నాళ్ళ పాటు అయినా తన దైనందిన కార్యకలాపాలకు విరామం ప్రకటించి ముందు తన ఆరోగ్యం చూసుకోవాలని అంటున్నారు. తన ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొని పూర్తిగా హెల్త్ గా ఫిట్ నెస్ తో ఆయన ఉండాలని అంతా కోరుకుంటున్నారు.
పవన్ తన ఆరోగ్యం విషయంలో పూర్తిగా శ్రద్ధ వహించాలని ఆయన అభిమానులతో పాటు ఏపీ జనాలు అంతా కోరుకుంటున్నారు. పవన్ లో ప్రజా నాయకుడు ఉన్నారు. ఆయనలో ప్రజలకు మేలు చేయాలన్న తపన ఉంది. అలాంటి నాయకుడి ఆరోగ్యం ప్రజలకు కూడా చాలా ముఖ్యమని అంటున్నారు. సో పవన్ గురించే ఇపుడు అందరూ ఆలోచిస్తున్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలని ప్రార్ధిస్తున్నారు.