రేవంత్‌ రెడ్డితో పవన్‌ కళ్యాణ్‌ భేటీ.. అసలు కారణం ఇదేనా?

ఇందులో భాగంగా తాజాగా సీఎం చంద్రబాబును కలిసి కోటి రూపాయం విరాళం అందజేసిన పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌ లో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు.

Update: 2024-09-11 05:54 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. ఇది రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. పవన్‌ ఎన్డీయే కూటమిలో కీలక నేతగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏర్పాటులో పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్ర పోషించారు.

 

ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పవన్‌ కల్యాణ్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే వీరిద్దరి భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని అంటున్నారు. కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను వర్షాలు, వరదలు ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్‌ భారీ విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందరి కంటే అత్యధికంగా ఆరు కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ఏపీ, తెలంగాణకు కోటి రూపాయల చొప్పున విరాళాన్ని ప్రకటించారు. మిగిలిన నాలుగు కోట్ల రూపాయలను ఏపీలో వరదలతో నష్టపోయిన గ్రామ పంచాయతీలకు కేటాయించారు. ఒక్కో గ్రామ పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున ఇప్పటికే జనసేన పార్టీ నేతలు పవన్‌ తరపున అందజేశారు.

ఇందులో భాగంగా తాజాగా సీఎం చంద్రబాబును కలిసి కోటి రూపాయం విరాళం అందజేసిన పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌ లో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. జనసేన పార్టీ నేతలతో కలిసి వెళ్లిన పవన్‌.. ముఖ్యమంత్రి రేవంత్‌ కు కోటి రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్‌.. పవన్‌ కు జ్ఞాపికను బహూకరించి సత్కరించారు.

అలాగే ఇటీవల హైడ్రాను ఏర్పాటు చేసి చెరువులు, నాళాలను సంరక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని పవన్‌ కళ్యాణ్‌ అభినందించారు. కొద్ది రోజుల క్రితం ఏపీలో పవన్‌ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌ రెడ్డిపై ప్రశంసలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రేవంత్‌ మంచి పని చేస్తున్నారని, హైడ్రా మంచి ఏర్పాటని కొనియాడారు.

ఈ నేపథ్యంలో తాజాగా రేవంత్‌ తో భేటీ అయిన పవన్‌ హైడ్రా గురించి ప్రస్తావించినట్టు తెలిసింది. ఏపీలోనూ హైడ్రాలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులు, నదులు, వాగులను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూలుస్తామని పవన్‌ వెల్లడించినట్టు సమాచారం. ఈ మేరకు హైడ్రా స్ఫూర్తితో ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోందని రేవంత్‌ కు చెప్పినట్టు చెబుతున్నారు.

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ లోని రేవంత్‌ రెడ్డి నివాసంలో ఇద్దరి నేతల భేటీ జరిగింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, ఇతర అంశాలు, రాష్ట్ర విభజన సమస్యలు కూడా రేవంత్, పవన్‌ మధ్య చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు.

Tags:    

Similar News