నటుడు షిండేతో పవన్ భేటీ.. కీలక వ్యాఖ్యలు

షిండే కోరుకున్నట్లే మూడు రోజులకే పవన్ నుంచి స్పందన రావటంతో మంగళవారం ఆయన డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ అయ్యారు.

Update: 2024-10-09 06:19 GMT

కూటమి ధర్మాన్ని ఏ ఒక్కరు మిస్ అయినా జరిగే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని జనసేన అధినేత.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాగానే అర్థం చేసుకున్నారని చెప్పాలి. రాజకీయాలకు కొత్త కానప్పటికీ.. పాలనలో పెద్ద పట్టు లేని ఆయన..కూటమి ధర్మాన్ని మాత్రం నూటికి నూరుశాతం అర్థం చేసుకున్నట్లుగా చెప్పాలి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వుతో అపవిత్రమైనట్లుగా ఆరోపణలు రావటం తెలిసిందే.

దీనిపై పవన్ కల్యాణ్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఎపిసోడ్ కు స్పందించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన ఆయన.. ఆ దీక్షను ఉపసంహరించుకునేందుకు తిరుమలకు వెళ్లటం.. దీక్ష అనంతరం తిరుపతిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. లడ్డూ ప్రసాదంపై పవన్ స్పందనకు సీనియర్ నటుడు షాయాజీ షిండే స్పందించారు. ప్రముఖ ఆలయాల్లో ప్రసాదంతో పాటు ఒక మొక్కను కూడా ఇవ్వాలన్న సూచన చేయటం తెలిసిందే. తనకు అవకాశం ఇస్తే తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కలిసి తన సూచన గురించి చెబుతానని పేర్కొనటం తెలిసిందే.

షిండే కోరుకున్నట్లే మూడు రోజులకే పవన్ నుంచి స్పందన రావటంతో మంగళవారం ఆయన డిప్యూటీ సీఎం పవన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసుకునే వారికి ప్రసాదంతో పాటు.. ఒక మొక్కను ఇవ్వాలన్న సూచన చేశారు. ఈ సందర్భంగా పవన్ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఆయన.. ఒకరు చేసిన సూచనకు ఓకే చెప్పేయొచ్చు. కానీ.. అలా చేయని ఆయన తన రాజకీయ పరిణితిని ప్రదర్శించారు. తనకున్న పరిమితుల్ని మర్చిపోలేదన్న విషయాన్ని స్పష్టం చేశారు.

నటుడు షిండే సూచనను తాను స్వాగిస్తానని చెప్పిన పవన్.. ఇదే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుతో తాను చర్చిస్తానని పేర్కొన్నారు. ఆధ్యాత్మికతకు పర్యావరణ శక్తి కలిస్తే భావితరాలకు మేలు జరుగుతుందన్న షిండే ఆలోచనకు పవన్ సానుకూలంగా స్పందించారు. మహారాష్ట్రలోని మూడు ప్రముఖ ఆలయాల్లో వృక్ష ప్రసాద్ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్న విషయాన్ని షిండే చెప్పగా.. పవన్ ఆసక్తిగా ఆ వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. మంచి ఆలోచన ఏదైనప్పటికి వెంటనే తన నిర్ణయాన్ని వెల్లడించకుండా.. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించిన పవన్ తీరును అభినందిస్తున్నారు. కూటమి ధర్మం అంటే అంతేగా.

Tags:    

Similar News