పిఠాపురానికి పవన్...ఈసారి కూడా ఆసక్తికరమే !

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి వెళ్తున్నారు.

Update: 2025-01-17 22:30 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి వెళ్తున్నారు. ఆయన ఈ నెల 24న పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు.

గొల్లప్రోలులో తహసీల్దార్ కార్యాలయ భవనం, యూపీహెచ్ సీ భవనం వంటి వాటికి పవన్ కళ్యాణ్ ప్రారంభోత్సవాలు చేయనున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన ఇతర అధికార కార్యక్రమాలలో పవన్ పాల్గొంటారని ఆయన కార్యాలయ వర్గాల సమాచారం.

ఇదిలా ఉంటే ఈ పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తారు అని అంటున్నారు. ఈ పర్యటనలో పవన్ ఏమి మాట్లాడుతారు, కేడర్ కి ఏమి దిశా నిర్దేశం చేస్తారు అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు

ఈ నెల 10న పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటనకు వచ్చారు. ఆనాడు ఆయన చాలా విషయాలు మాట్లాడారు, తాను తొందరలో క్షేత్ర స్థాయి పర్యటనలు చేపడతాను అని చెప్పారు. వాటిని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తాను అని చెప్పారు.

ఈసారి పర్యటనలో ఆయన జనసేన క్యాడర్ కి ఈ విషయం మీద ఏమైనా చెబుతారా అన్నది కూడా చర్చిస్తున్నారు. అంతే కాదు పవన్ ఎక్కడ నుంచి బయల్దేరేది కూడా ఈ సమావేశంలో ప్రకటిస్తారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఏడాది మార్చి లో 12 నుంచి 14 వరకూ మూడు రోజుల పాటు జనసేన పార్టీ 11వ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. వాటికి సంబంధించిన విషయాలను కూడా ఆయన ఈ సమావేశాలలో చెబుతారని అంటున్నారు

ఎందుకంటే మార్చి అంటే కొద్ది రోజుల సమయమే ఉంది కాబట్టి ఏర్పాట్ల గురించి చేయాల్సిన కార్యక్రమాల నుంచి చెబుతారు అలాగే దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎపుడు వచ్చినా రాజకీయంగా సంచలనం రేకెత్తించే ప్రకటనలు చేస్తూ వస్తున్నారు.

అవి ఏపీలో కావాల్సినంత పొలిటికల్ హీట్ ని క్రియేట్ చేస్తున్నాయి. గతంలో ఆయన వచ్చినపుడు ఏపీలో లా అండ్ ఆర్డర్ విషయం మీద గట్టిగా మాట్లాడారు. తానే హోం మంత్రిని అయితే అని కూడా అన్నారు. ఇక తాజాగా ఆయన పిఠాపురం వచ్చినపుడు తిరుపతి తొక్కిసలాట మీద మాట్లాడారు. టీటీడీ చైర్మన్ ఈవో క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. మరి ఈసారి ఆయన ఏ రకమైన ప్రకటనలు చేస్తారు అన్నది కూడా ఆసక్తికరమే అంటున్నారు. తన సొంత నియోజకవర్గం నుంచి సంచలన స్టేట్మెంట్స్ ఇవ్వడం పవన్ ఒక వ్యూహంగా మార్చుకున్నారు అని అంటున్నారు. చూడాలి మరి ఈసారి పవన్ టూర్ లో ఏమేమి మాట్లాడుతారో.

Tags:    

Similar News