మీకు, మాకు కటీఫ్.. తేల్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అయితే తమకు డిప్యూటీ సీఎం పవన్ న్యాయం చేస్తారని ఆశించిన వారికి ఆయన కూడా రిక్తహస్తం చూపారు. మీకు, మాకు సంబంధమే లేదంటూ తేల్చేయడంతో వలంటీర్లు ఉసూరుమంటున్నారు.;

కూటమి ప్రభుత్వంలోని అత్యంత కీలక నేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయన ఓ మాట అన్నారంటే అదే విధాన నిర్ణయమన్నట్లు అమలు అవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి అంతే ప్రాధాన్యమిస్తున్నారు. యువనేత లోకేశ్ తోపాటు మంత్రివర్గంలోని ఇతర మంత్రులు కూడా పవన్ పై పూర్తి నమ్మకం ఉంచుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనతో తమ సమస్య చెప్పుకుంటే పరిష్కారమవుతుందని ఆశించారు వలంటీర్లు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా పనిచేసిన వలంటీర్లను కూటమి ప్రభుత్వం వచ్చాక తొలగించిన విషయం తెలిసిందే. అయితే తమకు డిప్యూటీ సీఎం పవన్ న్యాయం చేస్తారని ఆశించిన వారికి ఆయన కూడా రిక్తహస్తం చూపారు. మీకు, మాకు సంబంధమే లేదంటూ తేల్చేయడంతో వలంటీర్లు ఉసూరుమంటున్నారు.
విశాఖ ఏజెన్సీలోని అరకు నియోజకవర్గంలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వలంటీర్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వస్తే వలంటీర్లను కొనసాగించడంతోపాటు రూ.10 వేలు వేతనం చేస్తామని హామీని కొంతమంది వలంటీర్లు ఆయనకు గుర్తు చేయగా, తాము అధికారంలోకి రాక ముందు వలంటీర్లను కొనసాగిస్తామని చెప్పడం నిజమేనని, కానీ, అధికారంలోక వచ్చాక అసలు విషయం తెలిసిందని, వలంటీర్లను గత ప్రభుత్వం కొనసాగించలేదని దీంతో తాము ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయామని స్పష్టం చేశారు. వలంటీర్లకు ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పిన డిప్యూటీ సీఎం గత ప్రభుత్వం వలంటీర్లకు ఏ పద్దు కింద జీతాలు చెల్లించిందో కూడా తెలియడం లేదని వెల్లడించారు.
ప్రభుత్వానికి సంబంధం లేకుండా వలంటీర్ వ్యవస్థను నడపడమే కాకుండా, వారిని మభ్య పెట్టారని ఆరోపించారు. వలంటీర్ వ్యవస్థను తిరిగి తీసుకొద్దామంటే అధికారికంగా ఎలాంటి ఆప్షన్ లేకుండా చేశారని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేయడంతో వలంటీర్లు ఉసూరుమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వలంటీర్ వ్యవస్థకు ముగింపు పలికారు. 2023 ఆగస్టు తర్వాత వలంటీర్లను రెన్యువల్ చేయకపోవడంతో తాము ఏమీ చేయలేమని ప్రభుత్వం వైసీపీపై నెపం నెట్టడంతో వలంటీర్ల ఉద్యోగాలు ఊడిపోయాయి. నెలకు రూ.5 వేల గౌరవ వేతనంతో 50 ఇళ్లకు ఒకరి చొప్పున గత ప్రభుత్వం వలంటీర్లను నియమించిన విషయం తెలిసిందే. తమ పార్టీకి అనుకూలంగా ఉన్నవారినే వలంటీర్లుగా నియమించుకున్నామని అప్పట్లో వైసీపీ నేతలు ప్రకటించడం వల్ల కూటమి ప్రభుత్వం వారిని పక్కన పెట్టేసిందని చెబుతున్నారు. అంతేకాకుండా గతంలో విపరీతమైన రాజకీయ వివాదాలకు వలంటీర్లే కేంద్రంగా ఉండటంతో కూటమి ప్రస్తుతం ఆ వ్యవస్థ జోలికి వెళ్లడం లేదు.
అసెంబ్లీ, శాసనమండలి వేదికగా పలుమార్లు వలంటీర్ వ్యవస్థ లేదని చెప్పిన ప్రభుత్వం వైఖరి మార్చుకుంటుందేమోనని ఇన్నాళ్లు వలంటీర్లు ఎదురుచూశారు. డిప్యూటీ సీఎం పవన్ చెబితే సీఎం చంద్రబాబు పునరాలోచన చేస్తారని భావించారు. దీంతో పవన్ ను నేరుగా కలిసిన కొందరు వలంటీర్లు తమ సమస్యలను నివేదించారు. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లే డిప్యూటీ సీఎం కూడా చేతులెత్తేయడంతో వలంటీర్ల కొనసాగింపు అనేది ఉండదని మరోసారి స్పష్టం చేసినట్లైందని అంటున్నారు.