'కాకినాడ' సమస్య.. టాలీవుడ్ దాకా.. పవన్ కెలికితే కష్టమే..!
కాకినాడ పోర్టు నుంచి అక్రమ బియ్యం రవాణా జరుగుతోందని.. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఇది వ్యవస్తీకృత నేరంగా మారిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కాకినాడ పోర్టు నుంచి అక్రమ బియ్యం రవాణా జరుగుతోందని.. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని.. ఇది వ్యవస్తీకృత నేరంగా మారిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దీనివెనుక.. ఎవ రున్నా వదిలి పెట్టబోమని అన్నారు. నిజానికి ఆయన చెప్పింది వాస్తవమే. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నవారి పని పట్టాల్సిందే. దీనివెనుక ఎవరున్నా వదిలి పెట్టకూడదన్నది కూడా వాస్తవమే. కానీ, ఇదిచెప్పినంత తేలిక కాదు.
ఎందుకంటే.. కాకినాడ పోర్టు నుంచి రవాణా అవుతున్న రేషన్ బియ్యం తాలూకు ఆనవాళ్లు కేవలం ఏపీ లోనే కాదు.. పొరుగు రాష్ట్రం తెలంగాణ వరకు ఉన్నాయన్నది అందరికీ తెలిసిందే. ఇంకో మాట చెప్పాలంటే..కర్ణాటక నుంచి కూడా కాకినాడకే బియ్యం వస్తాయి. ఇక్కడ నుంచే రేషన్‌బియ్యాన్ని పాలిష్ చేసి.. విదేశాలకు ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలకు తరలిస్తున్నారు. అంటే..ఏపీలో జరుగుతున్న ఈ దందా తాలూకు మూలాలు.. తెలంగాణ, కర్ణాటక వరకు కూడా వ్యాపించాయి.
ఇక, వ్యాపారుల విషయానికి వస్తే.. ఒక్క ఏపీకి చెందిన వ్యాపారులే.. ఒక్క వైసీపీకి చెందిన వ్యాపారులే దీనిలో ఉన్నారని అనుకుంటే పొరపాటు. ఈ వ్యాపారం వెనుక.. టాలీవుడ్ నిర్మాతలు కూడా ఉన్నారని జగమెరిగిన సత్యం. చాలా మంది తెలుగు నిర్మాతలకు ఉభయ గోదావరి జిల్లాల్లో రైస్‌మిల్లులు ఉన్నాయి. వాటిని నిర్వహించేందుకు ప్రత్యేకంగా మేనేజర్లను కూడా నియమించుకున్నారు. ఒక్కొక్కరికీ పదుల సంఖ్యలో మిల్లులు ఉన్నాయన్నది కూడా వాస్తవం.
అంతేకాదు.. ఎక్కువగా మిల్లులు ఉన్నది బడా నిర్మాతలకే. ఒకరిద్దరు ప్రముఖ కార్పొరేట్‌రంగానికి చెంది న వారివి ఉన్నాయి. ఇక, రాజకీయ రంగానికి చెందిన వారి మిల్లుల సంఖ్యకు లెక్కేలేదు. వీరంతా కాంగ్రె స్ సహా బీజేపీకి చెందిన నాయకులు ఉన్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌సహా.. తెలంగాణ, ఏపీల్లో రాజ కీయ ప్రముఖులకు మిల్లులు ఉన్నాయి. వీటి ద్వారానే పాలిష్ వ్యవహారం, రవాణా వ్యవహారాలు జరుగు తున్నాయి. ఇప్పుడు పవన్‌కట్డడి చేయాలని అనుకుంటే.. ముందు వీరిని ఆపాలి.
ఇది సాధ్యమేనా? అన్నది ప్రశ్న. ఏదైనా ఒక సమస్యను గుర్తించడం తేలికే. కానీ, దీనిని పరిష్కరించడమే కష్టం. అంతెందుకు.. తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత క్లోజ్‌గా ఉండే ఓ ప్రముఖ నిర్మాతకే 20కి పైగా మిల్లులు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. ఇలాంటి వాటిని ఆపడం సాధ్యం అయ్యే పని అయితే కాదు. అందుకే.. గతంలోనూ అనేక మంది ఈప్రయత్నాలు చేసి..చేతులు కాల్చుకున్నవారే. అయితే.. అందరూ అలానే ఉంటారని అనలేం. కాబట్టి పవన్ చేసే ప్రయత్నాలు సఫలమవ్వాలనే కోరుకుందాం.