‘బిగ్ షాట్’ కు పవన్ ఫియర్ లెస్ ఆదేశాలు
కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న ‘‘యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ’’లో తనిఖీలు చేపట్టాలంటూ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
తప్పు జరిగినట్లు తెలియానే కానీ.. బ్యాక్ గ్రౌండ్ గురించి ఆలోచించకుండా ఆదేశాలు ఇచ్చే నేచర్ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు ఎంతన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా అదే అంశాన్ని రుజువు చేసే మరో షాకింగ్ ఆదేశాల్ని జారీ చేయటం ద్వారా వార్తల్లోకి వచ్చారు. కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న ‘‘యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ’’లో తనిఖీలు చేపట్టాలంటూ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. దీంతో.. తప్పు చేసే వారెవరైనా సరే.. ఫియర్ లెస్ గా వ్యవహరిస్తూ ప్రజల పక్షాన నిలిచే నేతగా మరోసారి రుజువు చేసుకున్నారు.
దీనికి కారణం లేకపోలేదు. పవన్ ఆదేశాలు జారీ చేసిన సదరు కంపెనీ చిన్నదేమీ కాదు. దాని బ్యాక్ గ్రౌండ్ పెద్దదే. అయితే.. అలాంటివేమీ పట్టించుకోకుండా పర్యావరణానికి హాని చేసేలా పరిస్థితులు ఉన్నాయన్న సమాచారం అందిన వెంటనే.. తానే స్వయంగా రంగంలోకి దిగి.. అధికారులను లైన్ లోకి తీసుకొని కీలక ఆదేశాలు జారీ చేయటం ఆసక్తికరంగా మారింది. పవన్ ఆదేశాలు జారీ చేసిన సంస్థ చిన్నదేమీ కాదు.
యూనివర్సల్ బయో ఫ్యూయల్స్ అనేది భారతదేశంలో బయోడీజిల్ ఉత్పత్తిదారు మాత్రమే కాదు.. దేశంలోనే అతి పెద్ద బయోడీజిల్ ఉత్పత్తి కేంద్రాన్నినిర్వహించే సంస్థ. కాకినాడ తూర్పు నౌకాశ్రయానికి సమీపంలో ఉన్న ఈ సంస్థ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి ఎంతో తెలుసా? దగ్గర దగ్గర 60 మిలియన్ గ్యాలన్లు. అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఒక ఏడాదిలో ఈ సంస్థ ఉత్పత్తి చేసే బయో డీజిల్ ను లీటర్ల రూపంలో చెప్పాలంటే సుమారు 22కోట్ల లీటర్లుగా చెప్పొచ్చు.
ఇక.. ఈ సంస్థ నుంచి వెలువడుతున్న కాలుష్యకారక దుర్గంధం కారణంగా కాకినాడ చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో వారు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరకు తీసుకెళ్లటంతో ఆయన వెంటనే స్పందించారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ కృష్ణయ్యతో పాటు పీసీబీ కాకినాడ రీజనల్ ఆఫీసర్ శంకరరావుతో ఫోన్లో మాట్లాడిన ఆయన.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న యూనివర్సల్ బయో ఫ్యూయెల్ సంస్థలో తనిఖీలు నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. తనకు నివేదిక ఇవ్వాలన్నారు.
దీంతో రంగంలోకి దిగిన అధికారులు సదరు సంస్థలో తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ముడి పదార్థాలు వాడుతున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. నాసిరకం ముడి పదార్థాలు వాడుతున్న కారణంగా ఘాటైన.. దుర్గంధపూరిత వాయువులు వస్తున్నట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు అధికారులు చెప్పటంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆయన.. ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేస్తున్నారు.
ఈ సంస్థలో వినియోగించే ముడి సరుకుల ధరలు పెరగటంతో కల్తీ రసాయనాలు వాడినట్లుగా పీసీబీ అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ సంస్థపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. బయోడీజిల్ ఉత్పత్తిలో బిగ్ షాట్ గా పేరున్న సంస్థ తప్పుడు పనులపై డిప్యూటీ సీఎం పవన్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల్ని చూసినప్పుడు మాత్రం.. పలుకుబడి ఉన్న కంపెనీ అయినప్పటికి పవన్ కల్యాణ్ ఫియర్ లెస్ గా వ్యవహరించారన్న పేరును సంపాదించారు. మరి.. రానున్నరోజుల్లో ఏం జరగుతుందో చూడాలి.