మంత్రుల్లో పవన్ బెస్ట్.. చంద్రబాబు బర్త్ డే స్పెషల్

ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీల నేతలు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.;

Update: 2025-04-20 11:53 GMT

ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీల నేతలు ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు. చంద్రబాబు పుట్టిన రోజు వజ్రోత్సవాలను పురస్కరించుకుని టీడీపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఇక చంద్రబాబు మంత్రివర్గ సహచరులు కూడా సీఎం పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేందుకు పోటీ పడ్డారు. మంత్రులు అందరిలోనూ జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా ఉంది.

రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ఐటీ మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి వంగలపూడి అనిత, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తదితరులు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.

అయితే చంద్రబాబు మంత్రివర్గ సహచరుల్లోని 25 మందిలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ట్వీట్ స్పెషల్ గా నిలిచింది. తన ట్వీట్ లో చంద్రబాబు పరిపాలన, రాజకీయ అనుభవాన్ని పవన్ కొనియాడారు. విజన్ కు అనుగుణంగా పాలిస్తున్న పరిపాలనాదక్షుడిగా ప్రశంసలు కురిపించారు.

చంద్రబాబు నిరంతర శ్రామికుడు, అనితర సాధ్యుడు, దార్శనికుడిగా పవన్ అభివర్ణించారు. గత పాలనలో అన్నిరకాలుగా కుగింపోయిన రాష్ట్రాన్ని తన అపార రాజకీయ, పరిపాలన అనుభవంతో పునరుత్తేజం పొందేలా చేశారని ట్వీట్ చేశారు. ఆర్థికంగా కుంగిపోయిన రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపించడం చంద్రబాబు దార్శనికతకు నిదర్శనమని పవన్ వ్యాఖ్యానించారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తిస్తున్న చంద్రబాబు విజన్, నిరంతరం పనిలో చూపే ఉత్సాహం, వేగం అద్భుతమని ప్రశంసించారు.

Tags:    

Similar News