సంక్రాంతి తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం

సంక్రాంతి పండగ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించే నిర్ణయం తీసుకునే దిశగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు

Update: 2025-01-10 21:45 GMT

సంక్రాంతి పండగ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించే నిర్ణయం తీసుకునే దిశగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. కూటమి పాలనకు హనీమూన్ పీరియడ్ ముగిసిందని భావిస్తున్న డిప్యటీ సీఎం ఇక ప్రజల వద్దకే తన క్యాంపు కార్యాలయం తరలివెళ్లాలని నిర్ణయించారు. ఇందుకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు. ఇకపై ప్రతి నెలలోనూ 14 రోజుల్లో క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లాలని నిర్ణయించుకున్న పవన్ అందుకోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.

ఏజెన్సీలో పర్యటించిన సమయంలో అక్కడి సమస్యలను ప్రత్యక్షంగా చూసిన డిప్యూటీ సీఎం పవన్ జిల్లాల పర్యటనలపై అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. తన ఫేషీతో కలిసి జిల్లాల్లో పర్యటిస్తేనే గ్రామీణుల సమస్యలు పరిష్కారమవుతాయని భావించిన పవన్ సంక్రాంతి తర్వాత తన ప్రణాళికకు రూట్ మ్యాప్ ప్రకటించనున్నారని సమాచారం. ముందుగా శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలుపెట్టి ఒక్కో జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో తన క్యాంపు కార్యాలయం నిర్వహించాలని నిర్ణయించారు.

రాష్ట్రంలో 70 శాతం జనాభా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. రోడ్లు, కనీస వసతులు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నట్లు డిప్యూటీ సీఎం దృష్టికి వచ్చింది. విజయనగరం జిల్లా ఏజెన్సీలో పర్యటించిన సమయంలో ఆయన చెప్పులు బురదలో కూరుకపోయాయి. దీంతో చెప్పులు విడిచి నడిచి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఈ ప్రత్యక్ష అనుభవం డిప్యూటీ సీఎంపై తీవ్ర ప్రభావం చూపింది. నాయకులు ప్రజల్లో నడిస్తే నిజమైన సమస్యలు తెలుస్తాయని భావించిన ఆయన, నెలలో కొన్ని రోజులు పల్లెలకు వెళ్లి అక్కడే బస చేసి ప్రజలతో మమేకమవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సంక్రాంతి తర్వాత పల్లెబాటకు శ్రీకారం చుడుతున్నారు.

ఏదో సాదాసీదాగా కాకుండా పంచాయతీరాజ్ అధికార యంత్రాంగాన్ని మొత్తం తనతోపాటు పల్లెలకు తీసుకువెళ్లాలని పవన్ నిర్ణయించారు. గ్రామాల్లో రాత్రి నిద్ర చేయడంతోపాటు అక్కడే టెంటు వేసుకుని పంచాయతీరాజ్ మంత్రి ఫేషీని నిర్వహించాలని భావిస్తున్నారు. దీనివల్ల ఆయా ప్రాంతాల్లో సమస్యలపై పూర్తిగా ఫోకస్ చేసి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు.

Tags:    

Similar News