అంతొద్దు....ఇది చాలా పవన్ ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇలా ఉన్నారు అంటే ఆయన వెంబడి ఉన్నది హార్డ్ కోర్ ఫ్యాన్స్.

Update: 2024-12-21 03:32 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇలా ఉన్నారు అంటే ఆయన వెంబడి ఉన్నది హార్డ్ కోర్ ఫ్యాన్స్. వారికి పవన్ అంటే పడి చచ్చే అభిమానం. పవన్ కోసం ఏమైనా చేస్తామని అంటారు. పవన్ కళ్యాణ్ ని ఆఖరుకు సొంత కుటుంబీకుల నుంచి ఏమైనా అన్నా కూడా వారు అసలు తట్టుకోలేరు.

అంతటి పిచ్చి ప్రేమతో పవన్ ని వారు ఆరాధిస్తారు. అయితె పవన్ లో వారు ఎపుడూ హీరోనే చూసుకున్నారు. ఆయనను సీఎం గానే వారు భావిస్తూ వచ్చారు. ఆయన జనసేనానిగా ఉంటూ పోటీ చేయకపోయినా, పోటీ చేసి రెండు సీట్లలో ఓటమి పాలు అయినా ఇక ఈ రోజున ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయనను వారు చూసినప్పుడల్లా సీఎం అనే అంటారు. వారి అభిమానం అలాంటిది మరి.

తన హీరోనే ఫస్ట్. ఆయన తరువాతే ఏమైనా ఎవరైనా అన్నదే వారిది. పవన్ పార్వతీపురం మన్యం జిల్లా వెళ్ళినపుడు కూడా అభిమానగణం ఆయన వెంట పడింది. ఆయనను చూస్తూనే సీఎం అని హోరెత్తించారు ఫ్యాన్స్. అయితే వారి నినదాలు చూసిన పవన్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

నా పని చేసుకోనీయరా అని చిరుకోపం కూడా ప్రదర్శించారు. సీఎం అని అంటున్నారు. డిప్యూటీ సీఎం అయ్యాను కదా అని కూడా వారికి చెప్పాల్సింది చెప్పారు. సినిమాలు కాదు జీవితాలు చూడండి అంటూ మంచిగానే హితబోధ చేశారు.

అయితే పవన్ ఫ్యాన్స్ కి ఇవన్నీ మామూలే అన్నట్లుగానే ఉంటుంది. తమ నాయకుడు అలా అన్నా కూడా ఆయనే వారికి సీఎం. డిప్యూటీ సీఎం అయ్యాను కదా అని పవన్ అంటూంటే మా గుండెలలో నీవే సీఎం పవన్ అంటారు వారు. తమ నాయకుడు ఏపీకి ముఖ్యమంత్రి అయి తీరుతారు అన్నది వారి ప్రగాఢ నమ్మకం.

పవన్ కి పదవుల మీద ఆసక్తి లేదు అనే అంటారు. అయితే ఆయన కూటమిలో ఒక కీలక నేతగా బాధ్యతగా ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు. ఆయన తనకు ఇచ్చిన మంత్రిత్వ శాఖల విషయంలో చిత్తశుద్ధితో నిబద్ధతతో పనిచేస్తున్నారు.

ఆయన నెమ్మదిగా తన రాజకీయ బాటను వేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ రోజుకు ఈ రోజే సీఎం అయిపోవాలని ఆయనకు లేదు. ఒకవేళ రేపు అయినా పదవుల కంటే ప్రజల మేలు కోసమే అన్నది ఆయన ఆలోచనా విధానంగా ఉంటుంది.

కానీ ఫ్యాన్స్ ఊరుకోవడం లేదే. అదేదో సినిమాలో చిరంజీవి అన్నట్లుగా అంతోద్దు ఇది చాలదా అని పవన్ అంటుంటే మాకు అంతా కావాలీ నీవే మా సీఎం పవన్ అంటోంది ఫ్యాన్స్. ఒక విధంగా పవన్ కి ఫ్యాన్స్ కి ఉన్న తీయని బంధం కూడా ఇదే. వారి మనసు పవన్ కి తెలుసు. పవన్ ఏమిటో వారికి తెలుసు. అయితే పవన్ లో తాము చూసుకుంటున్న సీఎం బొమ్మ ఇంకా వారికి కనబడడం లేదు. అంతవరకూ వారు సీఎం అని అంటూనే ఉంటారు. ఇది తప్పదంతే.

Tags:    

Similar News