లడ్డూ అంశంపై సుప్రీం వ్యాఖ్యలపై పవన్ రియాక్షన్ ఇదే
అంతేకాదు.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ కీలక వ్యాఖ్యలు చేయటంపై వైసీపీ నేతలు తాము చెప్పిందే నిజమని పేర్కొనటం తెలిసిందే.
తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు విచారణ జరపటం.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు తెర తీశాయి. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటుకు గురయ్యారన్న రీతిలో రిపోర్టు అయిన పరిస్థితి. లడ్డూ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు తొందరపాటును సుప్రీం ప్రశ్నించినట్లుగా పేర్కొనటం తెలిసిందే. అంతేకాదు.. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ కీలక వ్యాఖ్యలు చేయటంపై వైసీపీ నేతలు తాము చెప్పిందే నిజమని పేర్కొనటం తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ అంశంపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న ఆయన.. తన దీక్షను విరమించుకోవటానికి వీలుగా తిరుమలకు వెళుతున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆయన దీక్ష ముగించి.. స్వామివారి దర్శనం చేసుకోనున్న సంగతి తెలిసిందే.ఈ సందర్భంగా మీడియా ఆయన వద్ద సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ప్రస్తావించగా పవన్ స్పందించారు.
కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు చెప్పలేదన్న పవన్.. వారి ముందున్న సమాచారం ఆధారంగా మాత్రమే వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ‘‘కల్తీ జరగలేదని న్యాయమూర్తులు చెప్పలేదు కదా? తేదీ విషయంలో మాత్రం కాస్త కన్ఫ్యూజన్ ఉందని అన్నారు. అయితే ప్రసాదం విషయంలో మాత్రమే కాదు.. గడిచిన ఐదేళ్లలో ఇలాంటి ఉల్లంఘనలు చాలానే జరిగాయి. మా ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకుంటుంది’’ అని పవన్ పేర్కొన్నారు.
గడిచిన ఐదారేళ్లుగా ఏదో ఒక అపవిత్రం జరుగుతోందని.. దాదాపు 219 ఆలయాల్ని అపవిత్రం చేశారని.. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం ఒక ప్రసాదం కోసం కాదని.. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు చాలా అవసరమన్న పవన్.. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. తాను ప్రాయశ్చిత్త దీక్షను విరమించిన తర్వాత ఈ అంశంపై డిక్లరేషన్ చేస్తామన్నారు.
తాను చేస్తున్నప్రాయశ్చిత్త దీక్షను విరమించేందుకు తిరుమలకు వెళుతున్న పవన్ కల్యాణ్.. తిరుపతి నుంచి అలిపిరి మీదుగా తిరుమలకు కాలి నడకన నడవనున్నారు. రాత్రి వేళలో తిరుమలకు పవన్ చేరుకుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు.. భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ నడక మార్గంలోనూ ముడెంచల భద్రతను సిద్ధం చేస్తున్నారు.