పవన్ 'నిర్బంధానికి' రెండేళ్లు పూర్తి.. నాటి ఘటనపై పవన్ సంచలన వ్యాఖ్యలు
పవన్ బయటకు రాకుండా.. 500 మంది పోలీసులను మోహరించారు.
జనసేన అధినేత, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ముఖ్యంగా 2022లో అప్పటి వైసీపీ ప్రభుత్వం తనను విశాఖలో నిర్బంధించిన వ్యవహారాన్ని ఆయన ప్రస్తావించారు. విశాఖలో పర్యటించేందుకు 2022, అక్టోబరు 15న పవన్ కల్యాణ్.. వెళ్లారు. అయితే, ఆయన ప్రజల్లోకి వస్తే శాంతి భద్రతలకు విఘాతంకలుగుతుందని పేర్కొంటూ.. అప్పట్లో ఆయనను స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లోనే పోలీసులు నిర్బంధించారు.
పవన్ బయటకు రాకుండా.. 500 మంది పోలీసులను మోహరించారు. దీంతో విశాఖలో పర్యటించి.. వైసీపీతప్పులను ప్రశ్నించాలని భావించిన పవన్ కల్యాణ్. విధిలేని పరిస్థితిలో నేరుగా విజయవాడకు చేరుకున్నారు. అయితే.. ఈ సందర్భానికి రెండేళ్లు నిండిన నేపథ్యంలో పవన్ స్పందిస్తూ.. ఆనాటి నిర్బంధమే.. తనలో కసి పెంచిందన్నారు. ఆ రోజు నుండి, జనసేన తన ముద్రను రాష్ట్రంలో, దేశంలో కొనసాగిస్తూనే ఉందన్నారు.
జనసేన పార్టీ చరిత్రలో ఆ నాటి నిర్బంధం ఓ అధ్యాయంగా మిగిలిపోయిందని పవన్ వ్యాఖ్యానించారు. ఆ రోజు రాష్ట్రం మొత్తం ప్రతి వీర మహిళ, ప్రతి జనసైనికుడు స్పందించారని, తనకు అండగా నిలిచా రని పేర్కొన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడాలనే అచంచలమైన సంకల్పం ఆనాడే కుదిరిం దన్నారు. ఈ సంకల్పమే పార్టీని ఏకం చేసిందని, అధికారంలోకి వచ్చేలా కూడా చేసిందని పవన్ వ్యాఖ్యానించారు.
''మనం ఎక్కడికి వెళ్లినా లేదా ఎంత ఎత్తుకు ఎదిగినా, అక్టోబర్ 15 ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి హృదయాలలో నిలిచిపోతుంది'' అని పవన్ పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా పార్టీకి బలాన్ని, లక్ష్యాన్ని అందించారని వీర మహిళలకు, కార్యకర్తలకు పవన్ తెలిపారు. ''ఒక తల్లి తన 2-3 ఏళ్ల చిన్నారితో జనసేన జెండా పట్టుకుని చేసిన నిరసన నిరంకుశ పాలనపై పోరాడేందుకు అపారమైన శక్తిని, ధైర్యాన్ని ఇచ్చింది'' అని గుర్తు చేసుకున్నారు.