పవన్ సంచలన నిర్ణయం తీసుకుంటారా ?

అయితే ఆయన రెండు పడవలలో కాలు పెడుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి.

Update: 2025-02-21 03:35 GMT

జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది. ఆయన రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేస్తున్నారు. అయితే ఆయన రెండు పడవలలో కాలు పెడుతున్నారు అన్న విమర్శలు ఉన్నాయి. రెండింటికీ న్యాయం చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు.

దాంతో పవన్ సినీ రంగానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారని వార్తలు అయితే గుప్పుమంటున్నాయి. ఇవి పుకార్లుగా షికారు చేస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే పవన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. వాటికి కూడా దాదాపుగా షూటింగ్ పూర్తి అయిపోవచ్చింది. పవన్ ఆ విధంగా ఆ రెండు సినిమాలకు గుమ్మడి కాయ కొట్టిన తరువాతనే ఇక సినిమాలకు స్వస్తి చెబుతారు అన్న చర్చ సాగుతోంది.

పవన్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ప్రజా జీవితం అంటే మక్కువ ఎక్కువ. ఆయన తాను ఓటమిని అంగీకరించే తత్వం కలిగిన వారు కారు. అందుకే 2019లో రెండు చోట్లా ఓడినా పట్టుదలతో తనదైన వ్యూహాలతో కూటమి కట్టించి మరీ ఉప ముఖ్యమంత్రిగా గెలిచి చూపించారు.

ఇక ఆయన ఎంతో ఇష్టమైన శాఖలను కూడా తీసుకున్నారు. అయితే పవన్ సినీ రంగానికి సమయం ఇవ్వలేని పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో రాజకీయం చేయాలని ఆయనకు ఉంది. అందుకే ఆయన రెండు సినిమాల కమిట్మెంట్ ని కూడా అనుకున్న టైంలో చేయలేకపోతున్నారు అని అంటున్నారు.

అదే విధంగా చూస్తే ఆయన రాజకీయాల్లో ఏకంగా పూర్తి జీవితం అంటే మరో పాతిక ముప్పయ్యేళ్ళ పాటు నిమగ్నం కావాలని అనుకుంటున్నారు. దానికి అవసరమైన శక్తిని కేవలం ఇక్కడే పెట్టాలని చూస్తున్నారు. ఇక చూస్తే ఆయనకు కొన్ని ఆరోగ్య ఇబ్బందులు కూడా ఉన్నాయని అంటున్నారు. ఆయన తరచూ జ్వరం, స్పాండిలైటిస్ తో బాధపడుతున్నారు.

ఇలా ఆయన ఇబ్బందులు పడటం కూడా రెండు కీలకమైన రంగాలలో ఒకేసారి సమయం వెచ్చించడం వల్లనే అని అంటున్నారు. దాంతో పవన్ ఇక మీదట తన జీవితం ప్రజలకే అంకితం అని చెప్పాలని అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. ఆయన కొత్తగా సినిమాలను ఒప్పుకోవడం లేదు అని అంటున్నారు.

ఆయన వద్దకు ఇటీవల కొత్త సినిమాల గురించి ప్రతిపాదనలు వచ్చినా ఆయన సున్నితంగానే పక్కన పెట్టారని అంటున్నారు. దాంతో పవన్ వెండి తెరకు పూర్తిగా దూరం అవుతారన్న వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. పవన్ ని వెండి తెర మీద చూడాలని అనుకునే వారికి మాత్రం అభిమాన హీరో ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే అది చేదు వార్తే అవుతుంది అని అంటున్నారు. అయితే ఆయన నిత్యం రాజకీయ తెర మీద కనిపిస్తారు అని సరిపెట్టుకోవచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరం అయితే మాత్రం అది అతి పెద్ద సంచలనమే అవుతుంది అని వేరేగా చెప్పాల్సిన పని లేదు.

Tags:    

Similar News