మమతా దీదీకి ఇచ్చి పడేసిన పవన్
కుంభ మేళా కాదు మృత్యు కుంభ్ అంటూ ఆమె చేసిన కామెంట్స్ మీద బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అయ్యారో తెలియదు కానీ మిత్ర పక్షంగా ఉన్న పవన్ మాత్రం గట్టిగానే ఇచ్చేశారు.
పశ్చిమ బెంగాల్ సీఎం దీదీగా అందరి చేత పిలిపించుకునే మమతా బెనర్జీకి ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఇచ్చి పడేశారు. కుంభ మేళా కాదు మృత్యు కుంభ్ అంటూ ఆమె చేసిన కామెంట్స్ మీద బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అయ్యారో తెలియదు కానీ మిత్ర పక్షంగా ఉన్న పవన్ మాత్రం గట్టిగానే ఇచ్చేశారు.
ప్రతీ వారికీ సనాతన ధర్మం మీద హిందుత్వం మీద విమర్శలు చేయడం ఈజీగా మారింది అంటూ పవన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన మహా కుంభమేళాలో మంగళవారం కుటుంబ సమేతంగా పుణ్య స్నానాలు ఆచరించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసారు.
అనంతరం ఆయనను జాతీయ మీడియా పలకరించింది. మహా కుంభమేళా మీద మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల మీద ఈ సందర్భంగా పవన్ తనదైన శైలిలో కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం మీద సులువుగా విమర్శలు చేయడాన్ని తప్పు పట్టారు. మన నాయకులతో ఇదే సమస్య అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.
హిందూమతాన్ని విమర్శలు చేసినంత ఈజీగా మిగిలిన వారి మీద చేయగలరా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి వైఖరితో ఉండే నాయకులతో కష్టమే అని పవన్ అన్నారు. వీళ్ళు తాము విమర్శిస్తున్నామని మాత్రమే అనుకుంటున్నారు తప్ప కోట్లాది మంది మనోభావాలను దెబ్బ తీస్తున్నామని గుర్తించడం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.
అది ఎప్పటికీ వారు తెలుసుకోరు అని పవన్ అన్నారు. మహా కుంభమేళ గత నలభై రోజులుగా సాగుతోంది. ఇది అతి పెద్ద ప్రపంచ వేడుక కోట్లాది మంది భక్తులు రోజూ వస్తున్నారు. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఇది బిగ్ టాస్క్ అని ఆయన అన్నారు.
ఉత్తరప్రదేశ్ అని కాదు పశ్చిమ బెంగాల్ లో అయినా ఇది పెను సవాల్ గానే ఉంటుందని పవన్ అన్నారు. కేవలం మహా కుంభమేళాకే కాదు రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమాలలో సైతం జనాలను అదుపు చేయడం ఎవరికైనా కష్టమే అని పవన్ వ్యాఖ్యానించారు.
ఆ మధ్య తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనను ఆయన ప్రస్తావిస్తూ ఇక్కడ ఎవరినీ తప్పుపట్టలేమని అన్నారు. అయినా సరే మహా కుంభమేళాను యూపీ ప్రభుత్వం చాలా సమర్ధంగా నిర్వహిస్తోందని ఆయన సీఎం యోగీ ఆదిత్యనాధ్ కి కితాబు ఇచ్చారు.
ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమని అన్నారు. ఇలాంటివి జరగకూడదని అంతా కోరుకోవాలని ఆయన అన్నారు. రాజకీయంగా ఎంతో అనుభవం కలిగిన నేతలకు తాను చెబుతున్నది ఒక్కటే అని పవన్ అన్నారు. ఈ తరహా ఆరోపణలు విమర్శలు మళ్ళీ చేయవద్దు అని కాస్తా కటువుగానే మమతకు చెప్పాల్సింది చెప్పేశారు.
నిజంగా పవన్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఈ రోజు మమతకు నిన్న కుంభమేళాని విమర్శించిన లాలూ యాదవ్ లాంటి వారికి సరైన మాస్టర్ స్ట్రోక్ అని అంటున్నారు. పవన్ సహేతుకంగానే మాట్లాడారు. ఆయన చాలా ఆలోచనాత్మకంగానే చెప్పారు. కొన్ని ప్రశ్నలను కూడా ఈ తరహా విమర్శలు చేసే నేతలకు పంపించారు. ఒక విధంగా పవన్ గట్టి డోస్ ఇచ్చారనే అంటున్నారు. బీజేపీ నేతలు ఎపుడూ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తారు.
కానీ పవన్ లాంటి ఒక మిత్ర పక్ష నేత బీజేపీని మించి ఈ స్థాయిలో సనాతన ధర్మాన్ని వెనకేసుకుని వస్తూ ఇచ్చిన ఈ స్ట్రాంగ్ రిప్లై మాత్రం జాతీయ స్థాయిలో అతి పెద్ద చర్చగా ఉంది. ఎనీ వే పవన్ మాత్రం కోట్లాది మంది ఉన్న హిందూ సమాజం దృష్టిలో మంచి ఇమేజ్ ని సాధించారు అని చెప్పక తప్పదు.