పవన్ డిక్లరేషన్ తో కూటమికి ప్లస్సేనా ?
ఎందుకంటే ఉమ్మడి పౌర స్మృతి తో పాటు ముస్లిం రిజర్వేషన్ల రద్దు వంటి అనేక తీవ్ర నిర్ణయాల మీద బీజేపీ ఎన్నికల వేళ గట్టిగానే మాట్లాడింది.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది మరో రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని. బీజేపీతో పొత్తు విషయమే టీడీపీని ఒకటికి పది సార్లు అప్పట్లో ఆలోచించేలా చేసింది. ఎందుకంటే ఉమ్మడి పౌర స్మృతి తో పాటు ముస్లిం రిజర్వేషన్ల రద్దు వంటి అనేక తీవ్ర నిర్ణయాల మీద బీజేపీ ఎన్నికల వేళ గట్టిగానే మాట్లాడింది.
అయితే ఏపీలో మాత్రం బీజేపీ పెద్దలు ఈ వాదనలు ఎక్కడా వినిపించలేదు. అలా ఎన్నికల్లో గట్టెక్కేశారు. ఇపుడు చూస్తే వక్ఫ్ బోర్డు రద్దు అని కేంద్రం అంటోంది. దానికి సంబంధించిన బిల్లు ఈ శీతాకాల సమావేశాలలో పార్లమెంట్ లో ప్రవేశపెడతారు అని అంటున్నారు. దాని మీద టీడీపీ స్టాండ్ ఏంటి అన్నది ఇంకా చూడాల్సి ఉంది.
ఈ మధ్యలో లడ్డూ ఇష్యూలో జనసేన తనదైన స్టాండ్ తీసుకుని ముందుకు పోతోంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూ ఇష్యూని ఒక దశ వరకే మాట్లాడి ఆ మీదట మౌనం దాల్చారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దానిని పీక్స్ కి తీసుకుని వెళ్తున్నారు.
ఆయన ఏకంగా వారాహి డిక్లరేషన్ అని అంటున్నారు. సనాతన ధర్మ బోర్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. సనాతన ధర్మానికి సంబంధించి ఇబ్బందులు ఎదురైతే కఠిన చర్యలు తీసుకోవడానికి ఒక పటిష్టమైన చట్టం తీసుకుని రావాలని కోరుతున్నారు. తిరుపతిలో వారాహి వాహనం మీద నుంచి పవన్ చేసిన ప్రసంగం చూస్తే బీజేపీ మాటలే ఎక్కువగా వినిపించాయి.
సూడో సెక్యులరిజం గురించి బీజేపీయే ఎక్కువగా మట్లాడుతుంది. ఇపుడు పవన్ నోట ఆ మాటలు వచ్చాయి. పైగా సనాతన ధర్మానికి విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోను అని ఆయన అన్నారు. ఈ విషయంలో ఎంతకైనా వెళ్ళి తేల్చుకుంటామని చెప్పారు. తాను రాజకీయాలను సైతం పక్కన పెట్టి ముందుకు సాగుతాను అని కూడా స్పష్టం చేస్తున్నారు.
ఏపీలో బీజేపీ ఈ విషయాల్లో బాగా తగ్గిపోతోంది. కానీ జనం బలం నిండుగా ఉన్న పవన్ ఇలాంటి ఇష్యూని టేకప్ చేశారు. చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ ఉందని అనేసి ఊరుకుంటే గత అయిదేళ్ళుగా ఇలాగే వైసీపీ పాలనలో జరిగిందని ఏకంగా అయోధ్యకు పంపించిన లక్ష లడ్డూల విషయంలో కూడా కల్తీవే వెళ్లాయని పవన్ మరింతగా రాజేస్తున్నారు.
సనాతన ధర్మం విషయంలో అన్యాయం జరుగుతూంటే మౌనంగా తాము కూర్చోవాలా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తాను ఉప ముఖ్యమంత్రిగా కాదు సనాతన ధర్మం అనుసరించేవాడిగా చెబుతున్నాను అన్నారు. మొత్తానికి చూస్తే పవన్ ధర్మాగ్రహం వెనక ఆయన ఆలోచనలు ఆయనకు ఉన్నాయి. దీనిని తప్పు పట్టాల్సింది లేదు.
అయితే కూటమిలో ఉంటూ ప్రభుత్వంలో బాధ్యత తీసుకుని ఈ విధంగా వీర హిందూత్వ వాయిస్ ని వినిపించడం ద్వారా పవన్ కూటమికి ప్లస్ చేస్తున్నారా లేక మైనస్ చేస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. మతానికి రాజకీయానికి ముడి పెట్టరాదు అన్నది రాజ్యాంగం చెబుతున్న మాట. ఇటీవల సుప్రీంకోర్టు కూడా అదే అంటోంది. రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్న వారు ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తే అవి ప్రజలలోకి వెళ్తే ఇబ్బందులు వస్తాయని కూడా అంటున్న వారు ఉన్నారు.
మరో వైపు చూస్తే టీడీపీ కూటమిలో కీలక మిత్రుడు అయిన పవన్ ని ఏమీ అనలేని పరిస్థితి ఉంటోంది. ఒక విధంగా పవన్ చేస్తున్న ప్రకటనలు అన్నీ బీజేపీకి ఆనందంగానే ఉంటాయి. కానీ టీడీపీయే ఇబ్బందులో పడుతోంది అని అంటున్నారు. చూడాలి మరి లడ్డూ ఇష్యూ కోర్టు తీర్పు తరువాత తగ్గిపోతుందా లేక పవన్ చెప్పినట్లుగా వారాహి డిక్లరేషన్ మీద మరింతగా జోరు చేస్తారా అన్నది. అదే కనుక జరిగితే ఏపీలో సరి కొత్త రాజకీయాలనే చూస్తారు అని అంటున్నారు