పవన్ కళ్యాణ్ మాటలు అతని ఫ్యామిలీకి నచ్చడం లేదా ?
ఉప ముఖ్యమంత్రి పదవి దాకా వచ్చి ఒక అడుగు దూరం అధికారం అని అభిమానులు ఆనందించేలా తన రాజకీయ గమనాన్ని ఆశావహం చేసుకున్న వారుగా ఉన్నారు.
By: Tupaki Desk | 24 Sep 2024 9:00 AM GMTపవర్ స్టార్ ఆయన. జనసేన అధినేతగా 2024లో నూటికి నూరు శాతం సీట్లు గెలిచి సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ అనిపించున్న వారు ఆయన. ఉప ముఖ్యమంత్రి పదవి దాకా వచ్చి ఒక అడుగు దూరం అధికారం అని అభిమానులు ఆనందించేలా తన రాజకీయ గమనాన్ని ఆశావహం చేసుకున్న వారుగా ఉన్నారు.
ఆయనే పవన్ కళ్యాణ్. టీడీపీ కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన ఏపీలో ముగిసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది అని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. దాంతో హిందూ ధార్మిక సన్స్థలతో సహా భక్తులు అందరిలో కలవరం రేగింది.
ఇది కార్చిచ్చు గా మారింది. కోటానుకోట్ల శ్రీవారి భక్తులు ఈ విషయంలో పూర్తిగా కలత చెందారు. వారి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో వచ్చిన ఆరోపణల మీద విచారణ సమగ్రంగా జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అనుమానాలను నివృత్తి చేసి దేవ దేవుడి ఆలయ పవిత్రత కాపాడాల్సి ఉంది.
అయితే జరుగుతున్నదేంటి అంటే చంద్రబాబు ఆరోపణలు చేసి వారం గడుస్తున్నా ఇంకా అక్కడే ఉంది విషయం. ఆరోపణల మీద దర్యాప్తు సాగించి దీనిని ఒక కొలిక్కి తీసుకుని రావాల్సిన నేపథ్యంలో ఇంకా అవే డిబేట్లు కొనసాగుతుండడంతో భక్తులు అంతా తల్లడిల్లిపోతున్నారు.
ఈ నేపథ్యం నుంచి చూసినపుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ దీని మీద పాలనాపరంగా అడుగులు ముందుకు వేయించాల్సిన బాధ్యతతో ఉండాలని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షను తీసుకున్నారు. పదకొండు రోజుల పాటు దీక్ష అని అన్నారు. దాంతో పాటు ఆయన ఊరుకోకుండా దేవాలయాల వద్దకు వెళ్ళి అక్కడ శుభ్ర పరచే కార్యక్రమాన్ని చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ చేస్తున్న ప్రకటనలు ఆయన తీసుకుంటున్న నిర్ణయాల మీద చర్చ సాగుతోంది. పవన్ ప్రతిపక్షంలో లేరు. కీలకమైన ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. నిప్పు లాంటి నిజం నిగ్గును తేల్చాల్సిన పదవిలో ఉన్నారు.
ఆ పని చూడాల్సింది కాకుండా ఇపుడు సనాతన ధర్మం అంటూ ఆయన మాట్లాడడం పట్ల కూడా చర్చ సాగుతోంది. ఆయనకు ఏమి తెలుసు సనాతన ధర్మం అంటే అని ఇండైరెక్ట్ గా సీపీఎం నాయకుడు బీవీ రాఘవులు ప్రశ్నించారు.
మరో వైపు ఇపుడు అగ్గి రాజుకున్నట్లుగా వ్యవహారం రాజుకుంది. ఈ సమయంలో సహనంతో సంయమనంతో వ్యవహారాన్ని దారికి తేవాల్సి ఉంది. కానీ పవన్ సనాతన ధర్మం అంటూ మాట్లాడడమే కాదు నేరు పోరాటం మొదలుపెడితే చనిపోవడానికి కూడా సిద్ధమని భీకరమైన ప్రకటనలు చేస్తున్నారు.
కొన్ని దశాబ్దాలుగా హిందువుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయని కూడా ఆయన అన్నారు. మౌనంగా హిందువులు ఉన్నారు అంటే బాధ లేదని కాదని పవన్ అన్నారు. హిందువుల నమ్మకాల మీద ఎవరైనా నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే ఎవరూ క్షమించరు అని కూడా పవన్ హెచ్చరించారు. సగటు హిందువులకు ఎపుడూ ఇతర మతాల వారి మీద ఎలాంటి ద్వేషం ఉండదని పవన్ అంటూనే తన సనాతన ధర్మ పోరాటం కొనసాగిస్తాను అని స్పష్టం చేస్తున్నారు.
పవన్ లో ఫైర్ ఉంది. అయితే దానికి శ్రీవారి లడ్డూల విషయంలో అసలు ఏమి జరిగింది. దోషులు ఎవరూ అన్నది పకడ్బందీగా విచారణ జరిపించి బయటపెడితే ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఖ్యాతిని అందుకుంటారని అంటున్నారు కానీ ఈ విధంగా చేయడం వల్ల మరింతగా వివాదం రాజుకుంటుంది తప్ప మరేమీ కాదని అంటున్నారు
దేశంలో కానీ రాష్ట్రంలో కానీ శాంతియుత వాతావరణం అన్నది చాలా ప్రాధాన్యతతో కూడిన అంశమని అంటున్నారు. ఈ విషయంలో ఎవరైనా కృషి చేయాలి. మరీ ముఖ్యంగా పాలకులు అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ చేస్తున్నది తీసుకున్న చర్యల పట్ల ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంత సంతోషంగా ఉంటారా అన్న చర్చ కూడా నడుస్తోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి పడిన ఒక అనుమానాన్ని తుడిచేసేందుకు పవన్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో అధికారికంగా చేయాల్సింది చేయాలనే అంతా కోరుకుంటున్నారు.